ఢిల్లీ సుల్తాన్‌లకు భయపడ
ఎన్నికేసులు పెట్టినా ఎదిరిస్తా
కేసీఆర్ 400 కేసులకే భయపడలే
కాళేశ్వరంతో ఆసిఫాబాద్‌కు కేసీఆర్ అన్యాయం
రిజర్వేషన్లు రద్దుచేసేందుకు జనగణన ఆలస్యం
సిద్దిపేటకు దొరల శని వదిలిస్తా
ఆసిఫాబాద్, సిద్దిపేట, మేడ్చల్ సభల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
కుమ్రంభీం ఆసిఫాబాద్/సిద్దిపేట/ మేడ్చల్, మే 2 (వియజక్రాంతి): ఢిల్లీ సుల్తాన్‌లు పెట్టిన కేసులకు భయపడే ప్రసక్తే లేదని, ఎన్ని కేసులు పెట్టినా ఎదిరిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటిం చారు. ‘బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ నాపై నాలుగువందల కేసులు పెట్టించిండు. అప్పుడే బయపడలేదు. ఢిల్లీలో నరేంద్రమోదీ పెట్టిస్తున్న కేసులకు బయపడతానా? కుమ్రంభీం, రాంజీ గోండ్ వంటి పోరాట యోధుల స్ఫూర్తితో కేంద్రంపై పోరాటం చేస్తా’ అని తేల్చి చెప్పారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఆసిఫాబాద్ ప్రాంతంలో లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందేదని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాలేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మించి ఈ ప్రాంతానికి అన్యాయం చేసిందని ఆరోపించారు.
ఆసిఫాబాద్‌లో ఆయన గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కుమ్రంభీం, పీపీరావు ప్రాజెక్టుల్లో నిండా నీరున్నా కాలువలు పూర్తి కాకపోవడంతో రైతన్నలకు కష్టాలు తప్పలేదని ఆవేదన వక్తంచేశారు. రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుం టామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల్లో ఐదింటిని అమలు చేశామని, 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు బడ్జెట్ కేటాయించామని చెప్పారు.
కోటా ఎత్తేసేందుకు బీజేపీ కుట్ర
ఎస్టీ, ఎస్సీ, బీసీల రిజర్వేషన్లను తొలగించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తు న్నదని సీఎం రేవంత్ ఆరోపించారు. అందులో భాగంగానే జనాభా లెక్కలు సేకరించకుండా అలసత్వం వహిస్తున్నదని విమర్శించారు. 1881 నుంచి ప్రతి పదేండ్లకు ఒకసారి జనగణన చేపట్టడం ఆనవాయితీ అని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 2021లో జనగణన చేపట్టాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు చేపట్టలేదని విమర్శించారు. అందుకు కారణం రిజర్వేషన్లను రద్దు చేసే కుట్రేనని ఆరోపించారు. లెక్కలు తీస్తే రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందని లెక్కించడం లేదని విమర్శించారు. రిజర్వేషన్ల రద్దుపై తాను పది రోజలుగా మాట్లాడుతుండటంతో ఢిల్లీ పోలీసులతో కేసులు పెట్టించి బయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ గెలిచిన మెదక్ పార్లమెంట్ స్థ్థానం నుంచి బీసీ ముదిరాజ్ ముద్దు బిడ్డ నీలం మధును గెలిపించాలని కొరారు. 1980లో మెదక్ నుంచి ఇందిరాగాంధీ గెలిచాకనే ఈ ప్రాం తం అభివృద్ధి జరిగిందని తెలిపారు. ప్రజల కష్టానష్టాల్లో తోడుండే నీలం మధు కావాలో.. ప్రజలను తోడేళ్లలా పీక్కతిన్న బీఆర్‌ఎస్ అభ్యర్థి కావాలో తెల్చుకొవాలని ప్రజ లకు సూచించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు పేరుతో వందల ఎకరాల భూములు లాక్కు న్న వ్యక్తిని బీఆర్‌ఎస్ తన ఎంపీ అభ్యర్థిగా నిలిపిందని విమర్శించారు.
నీలం మధును గెలిపిస్తే ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చే బాధ్యత మధు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ‘దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ దొరను గెలిపిస్తే ఏం పని చేయలేదు. ఇన్నాళ్లు దొరల కోసం త్యాగం చేసిన ప్రజలు.. ఇప్పుడు బీసీ బిడ్డకు పట్టం కట్టాలి’ అని కోరారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. రోడ్‌షోకు వచ్చిన జనాన్ని చూస్తే హరీశ్‌రావుకు నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు.
మోదీని కూడా బొంద పెడదాం
అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను బొంద పెట్టినట్లే లోక్‌సభ ఎన్నికల్లో మోదీని బొంద పెడదామని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మల్కాజిగిరి లోక్‌సభ కాంగ్రెస్ అభ్య ర్థి సునీతకు మద్దతుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్‌నగర్‌లో గురువారం నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి న 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలు అమలు చేశామని, ఎన్నికలు అయిపోగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు.
పదేండ్ల పాలనలో వేలకోట్లు దోచు కున్న కేసీఆర్ కుటుంబం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. డబ్బా ఇండ్లు వద్దు డబుల్ బెడ్రూం ఇస్తానని చెప్పి ఎవరికిచ్చారో చెప్పాలని నిలదీశారు. త్వరలోనే కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం ఇంటిని కట్టిస్తామని అన్నారు. ప్రధాని మోదీ పదేండ్లలో మనదేశాన్ని నిరుద్యోగంలో ప్రపంచంలోనే 60వ స్థానానికి తీసుకెళ్లారని విమర్శించారు.
కొంగుచాచి అడుగుతున్నా గెలిపించండి : ఆత్రం సుగుణ
ఆదివాసీ ఆడబిడ్డగా కొంగుచాచి అడుగుతున్నానని, చెయ్యి గుర్తుకు ఓటువేసి ఎంపీగా తనను గెలిపించాలని ఆత్రం సుగణ ప్రజలను అభ్యర్థించారు. రాష్ట్రంలో రేవంత్ నేతృత్వంలో ప్రజా పాలనను చూస్తున్నామని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. సామాన్య వ్యక్తిలా ఉంటూ ప్రజా జీవితం గడుపుతున్న రాహుల్‌గాంధీని ప్రధానిని చెద్ధామని పిలుపునిచ్చారు.
దొరల శని వదిలిస్తా
కొమురవెళ్లి మల్లన్న సాక్షిగా ఆగస్టు 15లోపు రైతు రుణామాఫీ చేస్తా. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తన రాజీనామాను రాసి పెట్టుకోవాలి. 45 ఏండ్లుగా సిద్దిపేటకు పట్టిన మామా అల్లుని శని వదిలిస్తా.
- సిద్దిపేట రోడ్ షోలో
సీఎం రేవంత్




