నాకు ఈపాటికి పాపనో బాబో ఉండేవారు!
టాలీవుడ్ యంగ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్(Priya Bhavani Shankar) ఇటీవల ‘ఇరుముడి’ చిత్రంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ సరసన భార్యగా, ఒక పాపకు తల్లిగా కనిపించి తన నటనతో ప్రశంసలు అందుకుంది.
ఈ రోజుల్లో చాలామంది హీరోయిన్లు చిన్న వయసులోనే తల్లి పాత్రల్లో నటించేందుకు ఇష్టపడకపోవడం కామన్. అయితే ప్రియా భవానీ శంకర్ మాత్రం పాత్ర స్వభావాన్ని, కథలోని ప్రాధాన్యతను బట్టి ముందడుగు వేయడం అందరినీ ఫిదా అయ్యేలా చేసింది. అయితే, ఈ సినిమా మంచి విజయం సాధించిన సందర్భంగా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పాత్ర, కెరీర్ నిర్ణయాలపై ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది ప్రియా భవానీ శంకర్. “దర్శకుడు మొదటిసారి ‘ఇరుముడి’ కథను వివరించినప్పుడు, అది ఎంతో భావోద్వేగంగా, మనసును హత్తుకునేలా అనిపించింది.
కాగితంపై చదివిన ఆ ఎమోషన్ అదే రీతిలో వెండితెరపైకి వస్తుందా.. లేదా? అన్న ఒకే ఒక్క సందేహం నాలో ఉండేది. కానీ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వడంతో ఆందోళన తొలగిపోయింది. తెరపై ఒక బిడ్డకు తల్లిగా నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఒకవేళ తనకు ఇరవై ఏళ్ల వయసులోనే వివాహం జరిగి ఉంటే, ఈపాటికి నిజ జీవితంలోనూ ఒక పాప లేదా బాబు ఉండేవారు. అందువల్ల ఇలాంటి పాత్రలు చేయడానికి వెనుకాడాల్సిన అవసరం లేదు. ఒక నటిగా తనకు పాత్ర కంటే కూడా ఆ కథ ఎంత బలంగా ఉందో చూసుకోవడమే ముఖ్యం. కాబట్టి కథ నచ్చితే ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాను” అని తెలిపింది.






