తన బలహీనతనే బలంగా మార్చుకునే గాంధారి
హీరోయిన్ తాప్సీ పన్ను(Actress Taapsee Pannu) నటించిన తాజాచిత్రం ‘గాంధారి’. దేవాశిష్ మఖిజా దర్శకత్వంలో కనికా థిల్లాన్ రచన, నిర్మాణంలో రూపొందిన హై-వోల్టేజ్ యాక్షన్ క్రైమ్-థ్రిల్లర్ చిత్రమిది. కథా పిక్చర్స్ బ్యానర్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలో తాప్సీ పన్నుతోపాటు ఇష్వాక్ సింగ్, స్వస్తిక ముఖర్జీ, ఛాయా కదం, జతిన్ సర్నా, మీతా వశిష్ట్ కీలక పాత్రలు పోషించారు. ఒక తల్లి, అదృశ్యమైన ఆమె కుమార్తె చుట్టూ తిరిగే కథతో రూపుదిద్దుకున్న ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.
ట్రైలర్ తాప్సీ పోషించిన దృష్టి లోపం ఉన్న పాత్రతో మొదలైందీ ట్రైలర్. తన చిన్న కూతురు రైలులో అపహరణకు గురి కావడం.. తన శారీరక పరిమితులు, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆ తల్లి తన బిడ్డను చేరుకోవడానికి ప్రయత్నిస్తూ, తన బలహీనతను బలంగా మార్చుకోవడం వంటి అంశాలతో ఆసక్తికరంగా ఉందీ ట్రైలర్. తల్లి-కూతుళ్ల అనుబంధాన్ని, ఒక తల్లి పడే సంఘర్షణను ఈ సినిమా భావోద్వేగభరితంగా ఆవిష్కరించనుందని ట్రైలర్ చూసే తెలుస్తోంది. ఇందులో తన కూతురిని తిరిగి పొందేందుకు ఎంతటి సాహసానికైనా సిద్ధపడే దృఢమైన, ధైర్యవంతురాలైన మహిళలో తాప్సీ అలరించనుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.






