జ్ఞానీ అంకుల్‌కు ఓటేయకండి

28-04-2024 12:07:12 AM

ప్రధాని మోదీపై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు

ప్రధానీ హోదాలో ఉండి తప్పుడు సమాచారం ప్రచారం 

జ్ఞానీ అంకుల్ మాటలు నమ్మకండి

వారి దృష్టిలో అందరూ అవినీతిపరులే.. మోదీ తప్ప

వల్సాద్ (గుజరాత్), ఏప్రిల్ 27: ప్రధాని నరేంద్ర మోదీకి ఓటేయొద్దంటూ కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్రమోదీని జ్ఞానీ అంకుల్ అని సంబోధిస్తూ విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధాని హోదాలో ఉండి మోదీ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారంటూ ప్రియాంక విమర్శించారు. ప్రజల అవసరాలను పట్టించుకోని వారికి ఓటేయొద్దని చెప్పారు. శనివారం గుజరాత్‌లోని వల్సాద్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. జ్ఞానీ అంకుల్ ఓ హోదాలో ఉండి, అర్థరహితమైన మాటలు మాట్లాడుతున్నారంటూ పరోక్షంగా ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ఆయన ఎప్పుడూ అసంబద్ధమైన ప్రసంగాలు ఇస్తూ.. వాటినే నిజాలని ప్రజలు గుడ్డిగా నమ్మాలని ఆయన ఆశిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.  ‘మీరు ఈ జ్ఞాని అంకుల్‌ను, ఆయన బక్వాస్ మాటలను నమ్ముతారా? ఈ అంకుల్ చెప్పే మాటలను మనం నమ్ముదామా? ఆయన ఈ దేశ ప్రధాన మంత్రేనా?’ అని దుయ్యబట్టారు. 

మహిళలపై దాడులు ఆపారా? 

పెన్షన్లు, సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాల మధ్య తీవ్ర వ్యత్యాసం ఉందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ పథకాలు అందక ఇబ్బందులు పడుతున్నారంటూ దుయ్యబట్టారు. మహిళలపై లైంగిక దాడులు, హింసాత్మక ఘటనలను మోదీ ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేకపోయిందని మండిపడ్డారు. ‘ప్రధాని నరేంద్రమోదీ  ప్రజాస్వామ్యాన్ని బలహీన పరుస్తున్నారు. ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు. అందరినీ అవినీతిపరులని పిలుస్తున్నారు. అవును మోదీ ఒక్కరే నీతిమంతుడు, ధర్మాత్ముడు కదా’ అంటూ ఎద్దేవా చేశారు.