26 May, 2026 | 3:58 AM

అవగాహనతోనే సమస్యల పరిష్కారం

26-05-2026 02:00 AM
  1. కృష్ణా జలాల వినియోగంపై సానుకూల చర్యలు
  2. రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలుగకుండా ప్రాజెక్టులు
  3. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
  4. సచివాలయంలో కర్ణాటక మంత్రి బోసురాజుతో భేటీ

హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): కృష్ణా నది నీటి వినియోగంపై తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సానుకూలంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ--కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, తాగు, సాగునీటి అవసరాలపై కర్ణాటక రాష్ట్ర చిన్ననీటి తరహాశాఖ మంత్రి బోసురాజు.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో సచివాలయంలో సో మవారం భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. కృష్ణా జలాలను రెండు రాష్ట్రాల వినియోగంపై పరస్పర అవగాహనతో స్నేహాపూర్వక వాతావరణంలో చర్చలు నిర్వహించామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిళ్ల కుండా ఉండేలా అనుసరించాల్సిన ప్రతిపాదనలను బోసురాజుకు వివరించినట్లు తెలిపారు. కృష్ణా నదిపై ప్రతిపాదిత బరాజ్ నిర్మాణానికి సంబంధించిన సాంకేతికత అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు వెల్లడించారు.

తెలంగాణ సాగునీటి, తాగునీటి హక్కులు పరిరక్షణ భవిష్యత్ అవసరాలకు అనుసరించాల్సిన విధి విధానలపై ప్రాథమిక చర్చలు జరిపినట్టు తెలిపారు. అంతర్ రాష్ట్ర సమన్వయంతో తాగునీటి సమస్యకు శాశ్వతంగా పరిష్కారానికి రూపొందించిన ప్రతిపాదనలు కర్ణాటక ముందుంచినట్లు చెప్పారు. ఉభయ రాష్ట్రాల చర్చలలో తెలంగాణ రైతాంగం సాగునీటి అవసరాలకు పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చి చర్చించినట్టు పేర్కొన్నారు.

ఈ భేటీలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రణాళికాశాఖ సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, రాయచూరు ఎంపీ కుమార్‌నాయక్, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఇరు రాష్ట్రాల ఎమ్మెల్యేలు, నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీధర్, సహాయ కార్యదర్శి శ్రీనివాస్, ఈఎన్సీ రమేశ్‌బాబు, కర్ణాటక  శాఖకార్యదర్శి పవిత్ర పాల్గొన్నారు.