28 August, 2026 | 4:28 AM

తాడ్కోల్ చౌరస్తాలో ప్రమాదం.. అధికార యంత్రాంగం అప్రమత్తం...

28-08-2026 12:27 AM

రోడ్డు పక్కన నిర్మాణాల తొలగింపు ప్రక్రియ ప్రారంభం

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తా వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి విద్యార్థిని మృతి చెందిన ఘటనతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించి, ప్రమాదాలకు దారితీస్తున్న పరిస్థితులపై ఆరా తీశారు. రహదారి పక్కన ఉన్న నిర్మాణాలు, ఆక్రమణల కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు గుర్తించిన అధికారులు వాటిపై దృష్టి సారించారు.

రహదారి విస్తరణకు, ట్రాఫిక్‌ సాఫీగా సాగేందుకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను గుర్తించి తొలగించే ప్రక్రియను ప్రారంభించారు.చిన్నారి మృతి ఘటన నేపథ్యంలో భవిష్యత్‌లో ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా రహదారి భద్రతపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. చౌరస్తా వద్ద ట్రాఫిక్‌ నియంత్రణ, రహదారి పక్కన ఉన్న నిర్మాణాల తొలగింపు తదితర అంశాలపై చర్యలు చేపడుతున్నారు.

ప్రమాదాలు జరిగిన తర్వాతే కాకుండా ముందస్తుగా రహదారి భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. తాడ్కోల్ చౌరస్తా వద్ద వాహనాల వేగాన్ని నియంత్రించడంతో పాటు, రహదారికి ఇరువైపులా ఉన్న అడ్డంకులను పూర్తిగా తొలగించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ పరిశీలన, చర్యల్లో ఆర్డీవో రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గోవు గంగాధర్, పట్టణ సీఐ తుల శ్రీధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.