7 August, 2026 | 2:42 AM

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక ప్రొఫెసర్ జయశంకర్

07-08-2026 01:39 AM

జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

సంగారెడ్డి, ఆగస్టు 6 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధనను జీవిత లక్ష్యంగా చేసుకుని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సైద్ధాంతిక బలాన్ని అందించి, తన జీవితాన్ని తెలంగాణ ప్రజల హక్కుల కోసం అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆయన ఆశయాలు భావితరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటాయని పేర్కొన్నారు.

గురువారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు సంగీత, పాండుతో కలిసి హాజరై ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జగదీష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.