calender_icon.png 18 February, 2026 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

16-02-2026 12:00:00 AM

ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ మండల కార్యదర్శి మర్రి మల్లారెడ్డి విమర్శలు

అశ్వాపురం, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రైతులు, రైతు కూలీలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ అశ్వాపురం మండల ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మండల పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అన్ని పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి, రెండు సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు ఏ హామీ పూర్తిగా అమలు కాలేదన్నారు.

రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి అరకొరగా మాత్రమే అమలు చేశారని ఆరోపించారు. రైతు బంధును రైతు భరోసాగా మార్చి ఎకరానికి సంవత్సరానికి రూ.15 వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ హామీ నిలబెట్టుకోలేదన్నారు. గత ప్రభుత్వం ప్రతి సీజన్లో ఇచ్చిన పెట్టుబడి సాయాన్ని కూడా ఈ ప్రభుత్వం సక్రమంగా ఇవ్వలేదని విమర్శించారు.

అన్ని వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి, తరువాత సన్న వడ్లకు మాత్రమే పరిమితం చేసి, అది కూడా రైతుల ఖాతాల్లో జమ చేయలేదన్నారు. గత రబీ సీజన్ బోనస్ పూర్తిగా చెల్లించకపోగా, ఈ ఖరీఫ్ సీజన్లో పంట కొనుగోలు చేసి రెండు నెలలు గడిచినా బోనస్ చెల్లించలేదని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే, రైతు భీమా ద్వారా పది రోజుల్లోనే కుటుంబానికి రూ.5 లక్షలు అందించేవారని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతు భీమా పథకాన్ని నిలిపివేసిందని, రైతు కుటుంబాలకు మేలు చేసే ఈ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సాయం ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. యూరియా పంపిణీ విషయంలో యాప్ విధానం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గతంలో అవసరమైన యూరియా బస్తాలు సులభంగా అందేవని, ఇప్పుడు క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. యూరియా పంపిణీలో యాప్ విధానాన్ని ఎత్తివేసి, రైతులకు సౌకర్యంగా ఎరువులు అందించాలని కోరారు.

ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి లేదని, రైతులకు మేలు చేసే పథకాలు అమలు చేయడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతుల హక్కులను కాపాడాలని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేకపోతే కలిసొచ్చే పార్టీలతో, ప్రజా సంఘాలతో కలిసి బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బలమైన రైతు ఉద్యమాన్ని చేపట్టి ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.