16-10-2025 01:51:05 AM
బ్లాక్ మనీ సామ్రాజ్యాలను బ్రిలియంట్‌గా నిర్మించుకుంటున్న రాజకీయ నేతలు
హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి) : హైదరాబాద్ పరిధిలోని ఒక కాలే జీలో జరిగిన చోరీ ఘటన విద్యా సంస్థలను కుదిపేసి, సంచలనంగా మారింది. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బ్రిలియంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్‌లో ఉన్న రూ. 1.07 కోట్ల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ చోరీ ఘటన అక్టోబర్ 10న తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం రాత్రి 2 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కాలేజీ గోడ దూకి లోపలికి ప్రవేశించి, ప్రిన్సిపాల్ కార్యాలయం కిటికీ పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.
అల్మారాలోని స్టీల్ లాకర్‌ను ధ్వంసం చేసి, అందులో ఉన్న నగదు మొత్తం రూ.1.07 కోట్ల నగదు, సీసీ టీవీ రికార్డింగ్ ఉన్న డీవీఆర్ పరికరాన్ని కూడా దొంగలు తీసుకెళ్లారు. ఉదయం సిబ్బంది కార్యాలయానికి వచ్చిన తర్వాత ఈ దోపిడీ విషయం బయటపడింది. వెంటనే అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దొంగతనం, చోరీ కేసుల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ కాలేజీ అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేకి చెందినది కావడంతో ఈ ఘటన రాష్ర్ట రాజకీయ, విద్యావర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అంత భారీ మొత్తంలో నగదు, అది కూడా బ్యాంక్‌లో కాకుండా కాలేజీ కార్యాలయంలో దాచిపెట్టడంపై పలు అనుమానాలు, ప్రశ్నలకు తావిస్తుంది. విద్యార్థుల ఫీజుల రూపంలో సేకరించిన ఈ డబ్బు ‘నల్లధనం’ కాదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనతో తెలంగాణ లోని ప్రైవేట్ విద్యాసంస్థలు, రాజకీయ నేత లు, అధికారుల మధ్య ఉన్న బంధంపై మరోసారి దృష్టి పడింది. అయితే విద్యా రంగంలో పారదర్శకత, బాధ్యత అనే అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయం వచ్చిందని ఈ సందర్భంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అనధికార రియల్ ఎస్టేట్ డీల్స్, లిక్కర్ సిండికేట్లు, భూ కబ్జాల ద్వారా సంపాదించిన నిధులు రాజకీయ వ్యవస్థల్లోకి, విద్యాసంస్థల్లోకి చేరుతున్నాయని ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్రిలియంట్ కాలేజీ ఘటన.. ఆ వ్యవస్థలోని లోతైన అవినీతిని మరొకసారి బయటపెట్టిందని పరిశీలకులు చెబుతున్నారు.
కాలేజీలో నగదుపై పోలీసు దర్యాప్తు..
బ్రిలియంట్ కాలేజీలో దోపిడీ కేసులో పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ బృందాలను రంగంలోకి దింపి, కార్యాలయంలో వేలిముద్రలు సేకరిస్తున్నారు. కళాశాల బయట ఉన్న కొన్ని సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్‌లో రాత్రి సమయంలో నీడల్లా కదిలే అనుమానితుల దృశ్యాలు దొరకగా, వాటిని ఫ్రేమ్‌ల వారీగా విశ్లేషిస్తున్నట్టు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ అధికారి ఒకరు తెలిపారు. ‘లోపలి వ్యక్తుల ప్రమేయం ఉందేమో అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది’ అని ఆయన గోప్యంగా పేర్కొన్నారు.
ఇక, కళాశాల యాజమాన్యం మాత్రం తమ వైఖరిని సమర్థించుకునే ప్రయ త్నం చేస్తుంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నగదు సుమారు వెయ్యి మంది విద్యార్థుల నుంచి పెండింగ్ ఫీజు సేకరించినట్టు పేర్కొన్నారు. వారాంతంలో బ్యాం కులు పనిచేయకపోవడంతో తాత్కాలికంగా కార్యాలయంలోనే నిల్వచేసినట్లు వివరణ ఇచ్చారు. 2025లో ఆన్‌లైన్ పేమెంట్లు, బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పుడు అంత భారీ నగదు నిల్వ చేయడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని అనుమానాలు..
ఆ కాలేజీ యాజమాన్యం రాజకీయాలతో ప్రత్యక్షంగా సంబంధం కలిగి ఉండటంతో ఈ ఘటనపై మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది. చోరీ జరిగిన సదరు కాలే ‘బ్రిలియంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ’ ఆధ్వర్యంలో నడుస్తోం ది. కాంగ్రెస్ పార్టీ తరఫున కల్వకుర్తి నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే కసిరెడ్డి రాజేంద్రరెడ్డి ఆ సంస్థకు చైర్మన్ కావడం గమనార్హం. దీంతోపాటు ఆయనకు రియల్ ఎస్టేట్, విద్యారంగాల్లో వ్యాపార అనుబంధాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఘటన రాష్ర్ట రాజకీయాల్లో ఒక ఆందోళనకర పరిస్థితికి దారితీసింది.
దేశవ్యాప్త అవినీతికి ప్రతిబింబం..
అబ్దుల్లాపూర్‌మెట్ దోపిడీ కేసు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ-, విద్యా వ్యవస్థల మధ్య బంధానికి ప్రతిబింబంగా నిలుస్తుంది. తెలంగాణలో బయటపడిన ఈ ఘటన, ఇతర రాష్ట్రాల్లో కొనసాగుతున్న నల్లధన వ్యవస్థల ను బహిర్గతం చేస్తున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2025లో వెలుగుచూసిన ఒక ఘటన ప్రకారం పలువురు రాజకీయ నేతల కాలేజీలు ‘బ్లాక్ మనీ సామ్రాజ్యాలు’గా పనిచేస్తున్నాయని తేలింది. ఎన్నికల నిధుల కోసం అక్కడ సేకరించిన నగదును ‘లిక్విడ్ కాష్’ రూపంలో రాజకీయ క్షేత్రంలో నిధులుగా మార్చుతున్నారని నివేదిక పేర్కొంది.
హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికే 2012 నుంచే విద్యారంగం ‘డబ్బును తెల్లధనంగా మార్చుకునే కేంద్రాలు’ అనే ఆరోపణ లున్నాయి. ఇటీవల మహారాష్ర్టలో కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విద్యా సంస్థలకు చెందిన రూ.8 కోట్లు విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఇవన్నీ విద్యాసంస్థల రూపంలో నల్లధనాన్ని దాచిపెట్టే పద్ధతి ఎంత విస్తృతమైం దో చూపిస్తున్నాయి. ‘ఇవి కాలేజీలు కావు, అవినీతి చేసే వారికి సేఫ్ లాకర్లు,’ అని హైదరాబాద్‌కు చెందిన ఒక ఆర్టీఐ కార్యకర్త ‘ట్విట్టర్’లో పోస్ట్ చేశారు. బ్రిలియంట్ కాలేజీ దోపిడీ ఘటనపై సోషల్ మీడియాలో ఇప్పటికే పోస్ట్‌లు పెరిగిపోతుండగా, ప్రజలు మాత్రం ఇలాంటి ఘటనల్లో పారదర్శకతను కోరుకుంటున్నారు.
హై లెవల్ కమిటీ ఏర్పాటుకు డిమాండ్
అబ్దుల్లాపూర్‌మెట్ కేసు దర్యాప్తు వేగం పుంజుకుంటోంది. ప్రాథమిక విచారణలో ఎమ్మెల్యే కసిరెడ్డి రాజేంద్రరెడ్డి పేరు ప్రస్తావనలోకి వచ్చిన నేపథ్యంలో వ్యవస్థాత్మక సంస్కరణలపై డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. బీజేపీ నాయకుడు బండి సంజయ్ కుమార్ రాష్ర్ట గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలసి పొలిటిషియన్ యాజమాన్యంలోని అన్ని కాలేజీలను విచారించే హై లెవెల్ కమిషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ‘ఈ వ్యవస్థ మొత్తానికి ఆర్థిక ఆడిట్, యాజమాన్య పరిశీలన, నగదు బదిలీల తనిఖీ తప్పనిసరి చేయా’లని బండి సంజయ్ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఇది ఒక ఘటనకే పరిమితమయ్యే అంశం కాదని, రాష్ర్టవ్యాప్తంగా నడుస్తున్న పెద్ద మోసం, ప్రజా నమ్మకాన్ని కుదిపేస్తున్న అవినీతి తంతు’ అని ఆరోపించారు.
రాజకీయ నాయకుల ఆధిపత్యం..
దేశవ్యాప్తంగా అనేక ప్రైవేట్ కాలేజీలు, విశ్వవిద్యాలయాలు ప్రజాప్రతినిధుల ఆధీనంలో నడుస్తున్నాయనేది అందరికీ తెలి సిన వాస్తవం. కానీ ఇప్పుడిది మనీ లాండరింగ్‌కు ప్రధానమార్గంగా మారిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2024లో లింక్డిన్ నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో దాదాపు 90 % రాజకీయ నాయకులు లేదా వారి కుటుంబ సభ్యుల ఆధీనంలోనే ఉన్నాయి. వీరు లెక్కలకందని నిధులను విద్యాసంస్థ ల రూపంలో మలిచి చట్టబద్ధమైన వ్యాపారాలుగా చూపుతున్నారని ఆ నివేదిక స్ప ష్టం చేసింది. తెలంగాణ విషయానికొస్తే 2023లో విద్యాశాఖ ఆడిట్ రిపోర్ట్ ప్రకా రం రాష్ట్రంలో 1,200కి పైగా ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి.
వాటిలో సగానికి పైగా కాలేజీలు రాజకీయ కుటుంబాలకు అనుబంధమైనవే. ఈ విద్యాసంస్థలు జూ నియర్ కాలేజీలు, ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలు, కోచింగ్ సెంటర్ల రూపంలో విస్తరించి ఉన్నాయి. ఇవి విద్యారంగం పేరి ట న్యాయబద్ధమైన ఆదాయాన్ని సృష్టిస్తూ నే, నల్లధనాన్ని ‘తెల్లధనం’గా మార్చే ద్వంద్వ ప్రయోజనం అందిస్తున్నాయి. ‘ఇది క్లాసిక్ లాండరింగ్ మెకానిజం,’ అని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషియల్ సెన్సై స్ ఆర్థిక శాస్త్రవేత్త డా.మీరానాయర్ స్పష్టం చేశారు. ‘విద్యాసంస్థలు తప్పుడు ఖర్చుల ను చూపడం, ఆదాయాన్ని తక్కువగా ప్రకటించడం, నకిలీ విరాళా లు లేదా సరఫరా సంస్థల చెల్లింపుల ద్వారా నల్లధనాన్ని చట్టబద్ధంగా చూపడం వంటివి తరచూ జరిగే పద్ధతులే’నని అభిప్రాయపడ్డారు.
విద్యాసంస్థలపై పలు ఆరోపణలు..
హైదరాబాద్ పరిధిలో ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ స్థాయిలో నగదు నిల్వపై పలు అనుమానాలకు దారి తీస్తున్నది. అయితే గతంలో విద్యా సంస్థలను నిర్వహిస్తున్న పలువురు నాయకులు పార్టీ ఫండ్‌గా కోట్లు ఇచ్చిన సందర్భాలున్నాయి. దీనికి తోడు కాలేజీలను ‘కరెన్సీ స్టాక్ పాయింట్లు’ గా ఉపయోగించి ఓటు కొనుగోళ్ల కోసం లిక్విడ్ క్యాష్‌ను నిల్వ చేస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
2024 లోని లోక్‌సభ ఎన్నికల సమయంలో నగదు, మద్యం, డ్రగ్స్, వస్తువుల రూపంలో మొత్తం రూ.9,000 కోట్లు సీజ్ అయ్యాయని ఎన్నికల సంఘం నమోదు చేసింది. ఇది 2019 కంటే 150 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఇందులో డ్రగ్స్‌కు సంబంధించే 45 శాతం (రూ.3,958 కోట్లు) భాగాన్ని కలిగి ఉన్నాయి. అయితే ఇటీవల మహారాష్ర్ట, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో రూ.1,000 కోట్ల నగదు స్వాధీనం అయినట్టు తెలుస్తోంది.
ఇది 2019తో పోలిస్తే ఏడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఈసీఐ నిబంధనలకు అనుగుణంగా సీవిజిల్ యాప్, ప్లయింగ్ స్కాడ్ చెకింగ్ కారణంగా ప్రధాన బదిలీలన్నీ రాత్రి వేళల్లోనే జరుగుతున్నట్టు చెబుతున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల యజమానులు, ప్రమోటర్లు తమ సంస్థల వాహనాల్ని, బస్సుల్ని కూడా కరెన్సీ రవాణా కోసం వినియోగిస్తారని, పట్టుబడినప్పుడు కూడా వారు ‘ఇది సంస్థకు చెందిన డబ్బు’ అని చెప్పి బయట పడిపోతారని అనుభవజ్ఞులు పేర్కొంటున్నారు. చాలాసార్లు ఈ సంస్థల్ని భారీ స్థాయిలో నగదు బదిలీ చేసేందుకు ఉపయోగిస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
పన్ను ఎగవేత కేంద్రాలు..
2016లో ఆదాయపన్ను శాఖ దేశవ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో రూ. 32,000 కోట్లు విలువైన నల్లధనం బయటపడింది. అందులో విద్యారంగం, రియల్ ఎస్టేట్ రంగాలు అత్యధికంగా పన్ను ఎగవేతకు పాల్పడ్డాయని బహిర్గతమైంది. తాజా గా 2023లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉత్తరప్రదేశ్‌లోని 22 విద్యాసంస్థలను విచారించింది. విద్యార్థుల స్కాలర్‌షిప్ నిధు లలో రూ.75 కోట్లు దారి మళ్లించినట్లు బయటపడింది. ఈ దర్యాప్తులో నకిలీ కం పెనీలు, బినామీ ఖాతాల నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చింది. అదే విధంగా 2020లో తమిళనాడులో ఒక ప్రముఖ విద్యాసంస్థల సమూహం దాడుల్లో రూ.532 కోట్లు బయటపడ్డాయి. ఈ ఘటనలన్నీ విద్యారం గం పేరుతో సాగుతున్న ఆర్థిక దుర్వినియోగాల తీవ్రతను స్పష్టంగా చూపుతున్నాయి.
ఆన్‌లైన్‌లో ఫీజుల చెల్లింపులు..
విద్యాసంస్థల్లో జరుగుతున్న ఈ నల్లధన ప్రవాహంపై పౌర సమాజం కూడా స్పందించింది. సిటిజెన్స్ ఫర్ అకౌంటబిలిటీ ఫోరమ్ అనే స్వచ్ఛంద సంస్థ వచ్చే వారం భారీ నిరసన ప్రదర్శనకు సిద్ధమవుతోంది. అన్ని ప్రైవేట్ కాలేజీలు డిజిటల్ పేమెంట్ ద్వారా మాత్రమే ఫీజులు వసూ లు చేయాలని, థర్డ్ పార్టీ ఆడిట్లు తప్పనిసరి చేయాలని వారు డిమాండ్ చేశారు. ‘రేవంత్ రెడ్డి ప్రభుత్వం పారదర్శకతకు కట్టుబడి ఉందని చెబుతున్నది నిజమే అయితే దీనిపై చర్య తీసుకోవాలి’ అని ఆ ఫోరమ్ కన్వీనర్ లక్ష్మీదేవి పిలుపునిచ్చారు.
ఆమె మాట్లాడుతూ.. ‘ఎన్నికల సంఘం స్వాధీనం చేసే నగదు సముద్రంలో చినుకుల్లాంటిది మాత్రమే. ఈ నగదు మూలా లను కట్టడి చేయడమే నిజమైన నియంత్రణ’ అని వ్యాఖ్యానించారు. 2024 సుప్రీంకోర్టు తీర్పుతో ఎలక్షన్ బాండ్లు రద్దు కావడంతో, రాజకీయ నిధుల పారదర్శకత మరింత మందగించింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ పరిణామం ‘మరింత డబ్బు నల్లధనంగా మారే ప్రమాదం’ ఉందని హెచ్చరించారు. ఇక తెలంగాణలో ఉపఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ వివాదం రాజకీయంగా కీలక మలుపు తీసుకుంది.
బ్రిలియంట్ ఇన్‌స్టిట్యూట్‌లో దోపిడీ, సాధారణ చోరీ కాదు, అది మన ప్రజాస్వామ్య వ్యవస్థలోని సమస్యను బయట పెట్టిందని వాదనలు వినిపిస్తున్నాయి. న్యాయస్థాన పర్యవేక్షణలో విచారణ జరగకపోతే ఈ దోపిడీ, మనీ లాండరింగ్, ఎన్ని కల దుర్వినియోగం అనే ఈ చక్రం ఆగదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమం లో చివరికి నష్టపోయేది విద్యార్థుల భవిష్యత్తు, దేశ ప్రజాస్వామ్య నైతికతే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.