03-12-2025 02:09:00 PM
మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): పార్లమెంటు సమావేశాలలో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి, చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల బిల్లు పెట్టి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాల ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా బీసీలకు చట్టసభలలో తగిన ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరమన్నారు. దేశ జనాభాలో 10 శాతం లేని అగ్రకులాలే దేశాన్ని, రాష్ట్రాన్ని 79 సంవత్సరాలుగా పాలిస్తున్నారనీ, ఇదేనా ప్రజాస్వామ్యం, ఇదేనా సామాజిక న్యాయం అని ప్రశ్నించారు.
పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న 36 రాజకీయ పార్టీల నుంచి 32 పార్టీలు బీసీ రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఉన్నాయన్నారు. 9 రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపినప్పటికీ బీసీ బిల్లు ఎందుకు ప్రవేశపెట్టడం లేదని బిజెపి ప్రభుత్వం బీసీ సమాజానికి చెప్పవలసిన అవసరం ఉందన్నారు. 40 సంవత్సరాలుగా చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ, ప్రజాస్వామ్య వాటాకై ఉద్యమం చేస్తున్నప్పటికీ, మా డిమాండ్ లను గత కాంగ్రెస్ ప్రభుత్వంగాని, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గానీ పెడచెవిన పెట్టడం అంటే ఇది పూర్తిగా బీసీల పట్ల వివక్షగా భావిస్తున్నామన్నారు.
ప్రజాస్వామ్యం సుస్థిరంగా ఉండాలంటే ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంతా ఉండాలనీ, ఇప్పటికైనా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్లమెంటు సమావేశాలలో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, బీసీ నాయకులు గజెల్లి వెంకటయ్య, షాకపూరి భీమ్సేన్, ఆరెందుల రాజేశం, అంకం సతీష్, చలిమల అంజయ్య, అంకం సతీష్, పెద్దపల్లి సూరయ్య, రాజన్న చారి, శెట్టిపల్లి గట్టయ్య, ధర్మాజీ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.