calender_icon.png 27 October, 2025 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాగ్మారే గౌతం కుటుంబానికి న్యాయం చేయాలి..

27-10-2025 08:00:29 PM

దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన..

ఇంద్రవెల్లి (విజయక్రాంతి): అటవీ శాఖ అధికారుల వేధింపుల వల్లే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఉట్నూర్ మండలంలోని గొట్టిపటార్ గ్రామానికి చెందిన వాగ్మారే గౌతం కుటుంబానికి న్యాయం చేయాలంటూ దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. దళితుని మృతికి కారణమైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాథోడ్ విజయలక్ష్మీని విధుల నుండి తొలగించాలని సోమవారం  ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనం నుండి ఫారెస్ట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గౌతం కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలతో హోరెత్తించారు.

దళిత సంఘాల నాయకులు గౌతం కుటుంబానికి రూ.20 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాతో పాటు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండల ఫారెస్ట్ అధికారి సంతోష్ మృతుని తండ్రితో పాటు దళిత సంఘాల నాయకులతో మాట్లాడారు. అప్పటికి ఆందోళనకారులు శాంతించకపోవడంతో అనంతరం దళిత సంఘాల నాయకులతో డీఎఫ్ఓతో ఫోన్ లో మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో దళిత సంఘాల నాయకులు శాంతించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు సోన్ కాంబ్లే జితేందర్, కాటం రమేశ్, దావుల రమేశ్, భారత్ సింగారే, దళిత సంఘాల పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.