05-12-2025 01:45:08 AM
అబ్దుల్లాపూర్‌మెట్, డిసెంబర్ 4: పెద్ద అంబర్‌పేట్ సర్వేనంబర్ 292లో ప్రభుత్వం నిర్మిస్తున్న ఎస్టీపీ ప్లాంట్ పనులు నిలిపివేసి ఇతర ప్రాంతంలోకి తరలించాలని నేతలు, పలు కాలనీవానులు గురువారం దీక్షలు నిర్వహించారు. ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్లాంట్ నిర్మాణం చేసే ప్రాంతంలో టెంట్ ఏర్పాటు చేసి నిరహార దీక్షలకు దిగారు. ఈ సందర్భంగా నాయకులు, కాలనీవాసులు మాట్లాడుతూ.. కాలనీల సమీపంలో జనావాసాల నడుమ సీవరేజ్ ప్లాంట్ నిర్మాణం చేయడం ద్వారా తమకు ఇబ్బందులు ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కాలనీల సమీపంలో కాకుండా దూర ప్రాంతంలో నిర్మాణం చేస్తే తమకు ఏలాంటి అభ్యంతరం లేదని.. ప్రభుత్వం తమ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్లాంట్‌ను మరో చోటుకు తరలించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు దీక్షలను కొనసాగిస్తామన్నారు.
మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ పండుగుల జయశ్రీరాజు, కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షులు కొత్తపల్లి జైపాల్‌రెడ్డి, నాయకులు సిద్దంకి కృష్ణారెడ్డి, దండెం రాజశేఖర్‌రెడ్డి, దండెం రాంరెడ్డి, బాటసింగారం బ్యాంక్ డైరెక్టర్ గంట శ్రీనివాస్ రెడ్డి, మరియల రాజు, దాసరి నర్సింగ్ రావు, అయ్యప్పరెడ్డి, అబికా నగర్, పోలీస్ కాలనీ, దయకర్ రెడ్డి కాలనీ, స్వగృహా కాలనీవాసులు పాల్గొన్నారు.