08-12-2025 07:11:16 PM
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాధికారి దీపక్ తివారి..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యాభ్యాసిస్తున్న విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించాలని జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు), జిల్లా విద్యాధికారి దీపక్ తివారి అన్నారు. సోమవారం జిల్లాలోని కెరమెరి మండలం సావర్‌ఖేఢా గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, వంటశాల, పరిసరాల పరిశుభ్రత, రిజిస్టర్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలని తెలిపారు. తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, వారికి అర్థమయ్యే రీతిలో విద్యా బోధన చేయాలని తెలిపారు.
తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో బోధన ప్రమాణాలు, మౌలిక వసతుల కల్పన, మధ్యాహ్నం భోజనం నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అవసరమైన అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల పంపిణీ, స్వీకరణ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ సిబ్బంది రాకపోకలు, సామగ్రి భద్రత, రవాణా, త్రాగునీరు, కూర్చోవడానికి సౌకర్యాలు, ఇతర లాజిస్టిక్ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించి, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విధులు సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.