30-07-2025 06:59:29 PM
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్..
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించే విధంగా బోధన సాగాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(District Collector Sneha Shabarish) అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం మరియపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలలోని మూడు, ఐదో తరగతి విద్యార్థులను, ఉన్నత పాఠశాలలోని తొమ్మిది, పదో తరగతి విద్యార్థులను గణితానికి సంబంధించిన అంశాలను కలెక్టర్ అడగగా విద్యార్థులు సమాధానమిచ్చారు. విద్యార్థులతో పాఠ్యాంశం పఠనం చేయించారు.
బోధన అంశానికి సంబంధించి విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాలను పరిశీలించేందుకు బోర్డుపై రాయించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల బోధనా పద్ధతిని కలెక్టర్ గమనించారు. పాఠశాలలకు సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం తయారు చేసే వంటగదిని కలెక్టర్ పరిశీలించి మెనూ ప్రకారం వంటలు చేస్తున్నారా అని వంట కార్మికులు, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ పాఠశాల తరగతి గదులు, ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలన్నారు.
అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
ఐనవోలు మండలం సింగారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్యను చదువుతున్న చిన్నారుల సంఖ్యను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న చిన్నారుల తల్లులు, గర్భిణీలతో కలెక్టర్ మాట్లాడారు. గ్రామానికి చెందిన ఎంతమంది చిన్నారులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారని అంగన్వాడి టీచర్, స్థానికులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... అంగన్వాడీ కేంద్రాలలో ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య అందుతుందని, గ్రామానికి చెందిన ఐదేళ్ల లోపు చిన్నారులు పూర్వ ప్రాథమిక విద్య అభ్యసించేందుకు అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలని సూచించారు. పిల్లల ఎదుగుదలకు అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలలో అందించే పౌష్టిక ఆహారాన్ని గర్భిణీలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జయంతి, ఐనవోలు తహసీల్దార్ విక్రమ్ కుమార్, ఎంపీడీవో నర్మద, ఎంఈవో ఆనందం, ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
భూభారతి దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను త్వరగా పూర్తిచేసి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం హనుమకొండ జిల్లా ఐనవోలు తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. భూభారతి దరఖాస్తుల ఆన్లైన్, భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. భూభారతి దరఖాస్తుల ఆన్లైన్, రిజిస్ట్రేషన్ల గురించిన వివరాలను తహసీల్దార్ విక్రమ్ కుమార్ ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్, ఇతర అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. భూభారతి దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను త్వరగా పూర్తిచేసి వాటిపై క్షేత్ర స్థాయిలో విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్, ఆర్ఐ లు, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.