25-12-2025 12:00:00 AM
నేడు అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి :
భారత ప్రజాస్వామ్య చరిత్రలో అటల్ బిహారీ వాజ్‌పేయిది ఒక చెరగని ముద్ర. తన అబ్బురపరమైన వాగ్ధాటితో, అచంచలమైన ఆత్మవిశ్వాసంతో, రాజకీయ చతురతతో, అసమానమైన రాజనీ తిజ్ఞతతో ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు. కవిగా, రచయితగా, వక్తగా, అసాధారణ ప్రజ్ఞావంతుడిగా, ధీరోదాత్త పాలకుడిగా పేరుపొందారు. గ్వాలియర్‌కు చెందిన ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో 1924 డిసెంబర్ 25న జన్మించిన వాజ్‌పేయి అంచెలంచెలుగా ఎదిగారు.
1939లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరి, 1947లో పూర్తిస్థాయి ప్రచారక్‌గా మారారు. హిందీ మాసపత్రిక రాష్ట్ర ధర్మ, వార పత్రిక పాంచజన్య తదితర పత్రికల్లో పని చేశారు. శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో ఏర్పడిన భారతీయ జనసంఘ్ (బీజేఎస్)లో చేరి, పార్టీ ఉత్తరాది జాతీయ కార్యదర్శి స్థాయికి ఎదిగారు. రెండో లోక్‌సభ ఎన్నికల్లో బలరాంపూర్ నుంచి తొలిసారిగా గెలిచి తన అసాధారణ ప్రతిభ తో నాటి ప్రధాని నెహ్రూ సహా అంద రి దృష్టిని ఆకర్షించారు.
అటుపై 1968లో జనసంఘ్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టి నానాజీ దేశ్‌ముఖ్, బల్రాజ్ మధోక్, ఎల్‌కే అద్వానీలతో కలసి పార్టీని విస్తరించారు. ఎమర్జెన్సీ సమయంలో జయ ప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో ఉధృతంగా సాగి న ఉద్యమంలోనూ వాజ్‌పేయి చురు గ్గా పాల్గొన్నారు. ఎమర్జెన్సీ తర్వాత 1977లో జనసంఘ్ మద్దతుతో కేంద్రంలో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో ఏర్పడిన జనతా సర్కారులో వాజ్‌పేయి విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఐక్యరాజ్యసమితిలో తొలిసారి హిందీలో ప్రసంగించారు.
అనంతరం 1980లో అద్వానీ, భైరాన్‌సింగ్ షెకావత్ తదితరులతో కలసి వాజ్‌పేయి బీజేపీని స్థాపించారు. అద్వానీ రథయాత్రను సమర్ధించిన వాజ్‌పేయి, 1992 డిసెంబర్ 6 నాటి బాబ్రీ మసీదు విధ్వంసాన్ని ‘అనాలోచిత చర్య’గా అభివర్ణించారు. 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకున్నారు. మూడుసార్లు దేశానికి ప్రధానిగా సేవలందించిన వాజ్‌పేయి తన పాలనా కాలంలో పీవీ ప్రవేశ పెట్టిన ఆర్థిక సంస్కరణలను కొనసాగిస్తూనే, మరిన్ని కీలక రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మార్గం సుగమం చేశారు.
స్వేచ్ఛా వాణిజ్యం, సరళీకృత విధానాలను అమల్లోకి తెచ్చారు. దేశం నాలుగు మూలలు కలుపుతూ స్వర్ణ చతుర్భుజి పథకంతో పాటు ‘ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన’ పథకాన్ని తీసుకొచ్చారు. అలాగే, ద్రవ్యలోటును తగ్గించారు. జీడీపీలో ప్రభుత్వ రంగం వాటా 2000 నాటికి 0.8 శాతం ఉండగా, ఈ సంస్కరణల అనంతరం 2005 నాటికి అది 2.3 శాతానికి చేరింది. టెలికం విభాగంలో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికారు.
నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను భారత్‌కు ఆహ్వానించి పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. నాటి పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్‌ను ఆగ్రా ఆహ్వానించి చర్చలు జరిపారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవలకు ఎన్నో అవార్డులు ఆయన సొంతమయ్యాయి. 2015లో దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఆయన్ను వరించింది. భరతమాత ముద్దుబిడ్డగా, రాజకీయనీతిజ్ఞుడిగా పేరు పొందిన వాజ్‌పేయి జయంతిని భారత ప్రభుత్వం ‘సుపరిపాలన దినోత్సవం’గా నిర్వహిస్తోంది.
గోరంట్ల శివరామకృష్ణ