24-12-2025 12:00:00 AM
మేకిరి దామోదర్ :
ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి ప్రభుత్వాలు చేస్తున్న ద్వంద్వ పాలన విధానంపై సమగ్ర చర్చ ఇప్పుడు చాలా అవసరం. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వాలు కేవలం హెచ్చరికలతో కూడిన హడావుడి చేస్తున్నాయి తప్ప కచ్చితమైన పరిష్కార మార్గాలు వెతకడంలో విఫలమవుతున్నాయి. ‘ధూమపానం, మ ద్యపానం ఆరోగ్యానికి హానికరం’.. ఈ వా క్యం నేడు భారతదేశంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్నది. దేశంలోని బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ చూసినా ఈ వ్యాఖ్యం ప్ర ధానంగా కనిపిస్తున్నది.
సిగరెట్ ప్యాకెట్లపై ధూమపానం చేస్తే కలిగే రోగాలతో కూడి న భయానక చిత్రాలు, మద్యం సీసాలపై ‘ఆరోగ్యానికి హానికరం’ అనే హెచ్చరికలు, రోడ్లపై ప్రకటన బోర్డులు, సినిమా థియేటర్లలో ప్రకటనలు, టీవీల్లో వచ్చే సినిమా ల మధ్య మధ్యలో వచ్చే తప్పనిసరి సూచనలు దీనికి అదనం. అయితే కేవలం హె చ్చరికలు చేయడం ద్వారా ప్రజలు వ్యసనాల బారిన పడడం తగ్గిందా అనే విష యంలో జవాబు అందరికీ తెలిసిందే. మ న దేశంలో వ్యసనాలకు బానిసలవుతున్న వారికి హెచ్చరికలు ఉన్నాయి.. -చట్టాలు ఉన్నాయి.. ప్రకటనలు ఉన్నా ఉపయోగం లేకుండా పోతుంది.
ఈ ప్రకటనలు ఉపయోగపడకపోగా క్యాన్సర్ మహమ్మారి విజృంభించేలా చేస్తోంది. ధూమపానం, మద్యపానం కారణంగా గుండె జబ్బులు, కాలేయ సమస్యలు పెరిగిపోతున్నాయి. బాధితుల అనారోగ్యంతో ఆయా కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోతున్నాయి. పచ్చ టి సంసారాలు శ్మశానాలుగా మారిపోతున్నాయి. ఇదంతా మన కళ్లముందు కదు లుతున్న స్పష్టమైన వాస్తవాలు.
ఈ సమస్యలు మన కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు మాత్రం మేము హెచ్చరిస్తు న్నాం కదా అనే సాకుతో చేతులు దులుపుకుంటున్నాయి. ప్రజారోగ్యాన్ని కాపాడేం దుకు కేవలం హెచ్చరికలు సరిపోతాయా? లేదంటే నిజంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు స్పష్టమైన విధానాలు అవసరమ వుతాయా అనే విషయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి.
వ్యవస్థాగత దోపిడీ..
మద్యపానం, ధూమపానం వంటి ప్ర జారోగ్య శత్రువులను సమూలంగా నిర్మూలించాల్సిన ప్రభుత్వాలే నేడు వాటిని ప్రధాన ఆదాయ వనరులుగా మార్చుకున్నాయి. ఇదే నేటి పాలనా విధానంలోని అత్యంత ప్రమాదకరమైన భావన. పన్ను లు పెంచితే ప్రజలు తాగడం మానేస్తారని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ వాస్త వం ఏమిటంటే.. పన్నులు పెరిగినా తాగ డం మాత్రం ఆగడం లేదు.ఎందుకంటే ఇది అవసరం కాదు ఒక వ్యసనం. ఈ వ్యసనాల ద్వారానే ప్రభుత్వ ఖజానాలు నిండుతున్నాయి. ప్రభుత్వ ఆదాయం పెరగడం కోసం వ్యసనాలకు బానిసలుగా మారి ప్రజలు అనారోగ్యం బారిన పడాల్సిందేనా అన్నది ఆలోచించాలి. ‘జబ్బు ఒకటి.. మందొకటి’ అన్న నానుడి ఇక్కడ అక్షరాలా అమలవుతోంది. ఒకవైపు వ్యా ధులు పెంచే విధానాలు, మరోవైపు వాటి నివారణ పేరుతో ఖర్చులు.. ఇదే ప్రభుత్వాల ద్వంద్వ వైఖరి. పేదల జేబులే పాల నకు మూలధనం. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో మద్యపానం ఎన్ని కుటుంబాలను కూల్చేస్తుందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. సగటు కూలీ రోజంతా కష్టపడితే వచ్చే ఆదాయం కావొ చ్చు.. ఒక మధ్యతరగతి ఉద్యోగి నెలంతా కష్టపడితే వచ్చే వేతనం కావొచ్చు.. ఏవైనా మద్యం దుకాణాల వద్ద కరిగిపోవాల్సిందే. మద్యపానానికి తోడు పొగాకు అలవాటు ఉన్న వ్యక్తుల కుటుంబాల బాధలు వర్ణణాతీతం. ఇది ఆయా వ్యక్తుల ఆరోగ్యాలను మాత్రమే కాదు కుటుంబ ఆర్థిక స్థిరత్వాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వాలు సంక్షేమ పథకాల పేరిట డ బ్బులు పంపిణీ చేస్తూనే.. ఇంకోవైపు అదే ప్రజలను మద్యపానం, ధూమపానానికి బానిసలుగా మార్చి పన్నుల రూపంలో ఆ డబ్బును తిరిగి లాగేస్తున్నాయి. ఇది కచ్చితంగా సంక్షేమం కిందకు అయితే రాదు. ప్రజల బలహీనతలను లాభంగా మార్చే వ్యవస్థాగత దోపిడీగా భావించాల్సిన వస్తుంది.
వ్యసనాల ప్రభావం..
ధూమపానం, మద్యపానం అనేవి యాదృశ్చికంగా ఏర్పడిన అలవాట్లు కాదు. ఈ రెండూ విడిగానే ఎంతో ప్రమాదకరం. అలాంటిది ఈ రెండూ కలిసి విజృంభిస్తే.. అది మన ప్రాణాలకు సంకటమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సీసీఎంబీ వంటి ప్రతిష్ఠాత్మక పరిశోధనా సంస్థలు చేసిన అధ్యయనాలు ఒక కీలక నిజాన్ని బయటపెట్టాయి. పొగాకులోని నికోటిన్ మద్యం తాగాలనే కోరికను పెంచుతుంది. అలాగే మద్యం సేవించిన తర్వాత నికోటిన్ తీసుకోవాలనే తపన మరింత బలపడుతుంది. అందుకే సాధారణంగా పొగ తాగని వ్యక్తి కూడా మద్యం సేవించే సమయంలో సిగరెట్ కోసం చేయి చాస్తాడని పలు సర్వేల్లో తేలింది. ఇది యాదృచ్ఛికం ఎంతమాత్రం కాదు.. ఇది వ్యసనాల మధ్య ఉన్న లోతైన శాస్త్రీయ బంధం. మెదడులో వ్యసనాల కుతూహలమే ఆల్కహాల్, నికోటిన్. మెదడులోని సెరిబ్రే వర్టిల్ కణాలపై ఇవి నేరు గా ప్రభావం చూపుతాయి. గ్లూటమేట్ అనే ఉత్తేజక న్యూరోట్రాన్స్‌మిటర్ స్థాయి పెరిగి, కృత్రిమ ఆనందాన్ని సృష్టిస్తుంది. ఒక్కసారి ఆ ఆనందాన్ని అనుభవించిన మెదడు, మళ్లీ అదే అనుభూతిని కోరుకుంటుంది. అలా వ్యక్తి స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే స్థితి నుంచి బానిసత్వానికి జారిపోతాడు. ఇది ఆనందం కాదు.. అలాగని స్వేచ్ఛ కాదు. కేవలం ఇది వ్యసనాల చేతి లో మనిషి ఓడిపోవడమే.
ఆరోగ్య భారతమెక్కడ?
మద్యపానం, ధూమపాన వ్యసనాన్ని మాన్పించేందుకు చికిత్సలు, మందులు ఉన్నాయి. కానీ రెండు వ్యసనాలు కలిసినవారిలో చికిత్స ప్రభావం తక్కువగా ఉం టోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక వ్యసనాన్ని తగ్గిస్తే మరో వ్యసనం పెరిగే ప్రమాదం ఉంది. ఇది వ్యక్తిగత వైఫల్యం కాదు. ఇది ప్రభుత్వాల విధాన వైఫల్యం. వ్యసనాలను నియంత్రించకుండా ఆదా య వనరులుగా చూసే పాలనా దృక్పథమే దీనికి మూలం. రాజ్యాంగ బాధ్యత ను విస్మరించిన ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని కాపాడటం రాజ్యాంగం ప్రభుత్వా లకు అప్పగించిన బాధ్యత. అయినా కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బాధ్యతను నిర్లక్ష్యం చేస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మద్యంపై ఖర్చు విప రీతంగా పెరుగుతోంది. అదే సమయంలో ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నా యి. ఈ పరిస్థితుల్లో ‘ఆరోగ్య భారతం’ అన్న నినాదం కేవలం ప్రచార వాక్యంగానే మిగిలిపోతోంది. సంక్షేమమా? శ్రేయో రాజ్యమా? అనే విషయంలో స్పష్టమైన ఎంపిక చాలా అవసరం. ప్రజల ప్రాణాల మీద నడిచే ఆదాయాన్ని ప్రధాన వనరుగా భావించడం అమానవీయ పాలనకు నిదర్శనం. ఇది సంక్షేమ రాజ్య భావనకు పూర్తిగా విరుద్ధం. శ్రేయో రాజ్యం అంటే ప్రజల ఆరోగ్యం మెరుగుపడాలి. వ్యసనాలు తగ్గాలి. కుటుంబాలు బలపడాలి. కానీ నేడు జరుగుతోంది మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధమని గ్రహించాలి.
ఆదాయ మార్గాలు..
ఇప్పటికైనా మద్యపానం, ధూమపానంపై పన్నులు వేస్తూ, హెచ్చరికలు చేయ డం లాంటి వాటితో ప్రభుత్వాలు కాలం గడపడం ఆపేయాలి. ఈ వ్యసనాలను దశలవారీగా నిర్మూలించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. మొత్తం వ్యవస్థను ‘స్లో అండ్ స్టడీ’ విధానంలో చేయాలి. దశల వారీగా తయారీ కేంద్రాలను తక్కువ సంఖ్యకు పరిమితం చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దుబారా, ప్రచార ఆర్భాటాలను తగ్గించుకొని ప్రత్యామ్నాయ ఆదా య మార్గాలను అభివృద్ధి చేసుకోవాలి. ‘జబ్బు ఒకటి.. మందు మరొకటి’ అనే ద్వంద్వ విధానాన్ని విడిచిపెట్టకపోతే, ప్రజారోగ్య విధ్వంసానికి ప్రభుత్వాలే బాధ్యుల వుతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ విష వలయం నుంచి ప్రజలను బయటకు తీసుకురావడమే నిజమైన సంక్షేమం. అదే నిజమైన శ్రేయో రాజ్యానికి సరైన మార్గం అని చెప్పొచ్చు.
వ్యాసకర్త సెల్: 9573666650