calender_icon.png 25 December, 2025 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జయహో ఇస్రో!

25-12-2025 12:00:00 AM

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గత ఆరు దశాబ్దాలుగా అంతరిక్ష పరిశోధనల్లో దూసుకుపోతున్నది. మహామ హుల కృషి ఫలితంగా ఇప్పటికే దేశీయంగా వంద ఉపగ్రహ ప్రయోగాల ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఇస్రో అటు విదేశీ ఉపగ్రహాలను సైతం అవలీలగా కక్ష్యలోకి పంపిస్తున్నది. తాజాగా అమెరికాకు చెందిన కొత్త తరం కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్-2ను ఇస్రో బుధవారం ఉదయం శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఎల్ వీఎం-3 ఎమ్-6 రాకెట్ ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టి తన ప్రస్థానంలో మరో మైలురాయిని చేరుకుంది.

నాటి ఆర్యభట్ట నుంచి చంద్రుడిపై రోవర్‌తో పరిశోధనలు, డాకింగ్ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చుకున్న స్పేడెక్స్ ఉపగ్రహ ప్రయోగాలతో భారత అంతరిక్ష యాత్ర అప్రతిహాతంగా సాగుతోంది. 1969లో ఇస్రో స్థాపనతో భారత అంతరిక్ష యాత్రలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఉపగ్రహాల ప్రయోగంలో ఇస్రో గణనీయమైన పురోగతి సాధించింది. 2008 అక్టోబర్ 22న భారత్ చంద్రయాన్-1 ప్రయోగం ద్వారా తొలిసారిగా చంద్రునిపై నీటి జాడలు గుర్తించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు.

2019 నవంబర్ 5న పీఎస్‌ఎల్వీ-సి25 ద్వారా ‘మంగళ్‌యాన్’ను  కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. పీఎస్‌ఎల్వీ-సి37 ద్వారా నింగిలోకి ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇస్రో ప్రయోగించే ఉపగ్రహాలతో వాతావరణ సూచన, సమాచార మార్పిడి , జీపీఎస్, భూమి పరిశీలన, శాస్త్రీయ పరిశోధన, రక్షణ వంటి అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయి. ఇస్రో అత్యంత కచ్చితత్వంతో తక్కువ ఖర్చు తోనే ఉపగ్రహాలు ప్రయోగిస్తుడడంతో విదేశాలు తమ పరిశోధనల కోసం మనవైపు చూస్తున్నాయి.

ఇస్రో పునర్వినియోగ రాకెట్ల (పుష్పక్) తయారీ, చిన్న రాకెట్ల ప్రయోగ వేదికను సిద్ధం చేస్తున్నది. ఇవి తక్కువ ఖర్చుతో కూడుకున్నవి కావడంతో అమెరికా సహా ఇతర దేశాలు ఉపగ్రహ ప్రయోగాలకు ఇస్రోనే ఏంచుకుంటున్నాయి. 2023 జూలై 30 నాటికి 34 వేర్వేరు దేశాలకు చెందిన 431 ఉపగ్రహాలను భారత్ ప్రయోగించడం విశే షం. ఇస్రో తన వాణిజ్య సంస్థ న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ ద్వారా విదేశాలతో వాణిజ్య ప్రయోగాలకు సంబంధించిన చర్చలను జరుపుతుం టుంది.

ఈ ఉపగ్రహాలను ఇస్రో..  పీఎస్‌ఎల్వీ, ఎల్విఎమ్--3 ఎక్స్పెండబుల్ రాకెట్ల ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. 2013-2015 మధ్యకాలం లో 9 దేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను ప్రయోగించిన ఇస్రో.. దాదాపు 801 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించడం గమనార్హం. ఇస్రో ఆధ్వర్యంలో అంతరిక్ష పరిజ్ఞానంలో స్వదేశీ పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. చంద్రుని మీదకు అడుగుల వేశాం. అంగారకుని మీద అధ్యయన యాత్రలతో పాటు సూర్యుని మీద దృష్టిని సారించాం.

మూడు చంద్రయాన్ మిషన్లు, మార్స్ ఆర్బిటర్ మిషన్, ఆదిత్య ఎల్--1 మిషన్.. ఇలా ప్రతిష్ఠాత్మకమైన ప్రయోగాలు పూర్తిచేసుకొని రాకెట్ రంగంలో ఇస్రో తన స్థా నాన్ని పదిలం చేసుకుంది. వచ్చే ఏడాది మార్చిలో గగన్‌యాన్ మానవరహిత ప్రయోగం ద్వారా ఇస్రో కొంత పుంతలు తొక్కనుంది. రాబోయే ఐదేండ్లలో మరో వంద ప్రయోగాలు చేపట్టనున్నట్టు ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ ఇటీవల ప్రకటించారు. జయహో ఇస్రో.. జయహో భారత్.