ఒంటికి, రెంటికి బిగబట్టాల్సిందే!
గరిడేపల్లిలో రోజురోజుకూ పెరుగుతున్న రద్దీ..
అయినా మూత్రశాలల కరువు
మహిళలు, వృద్ధులు, ప్రయాణికులకు తప్పని అవస్థలు
సులభ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని ప్రజల విజ్ఞప్తులు
గరిడేపల్లి, జూన్ 4: జిల్లాలో అతి పెద్ద మండలం గరిడేపల్లి. అయితే గరిడేపల్లి మండల కేంద్రం జిల్లా కేంద్రమైన సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ పట్టణాలకు మధ్య ఉంటుంది. దీంతో ఇక్కడ ఎప్పుడూ జనాలు రద్దీగా ఉంటారు. అయినా ప్రజా మూత్రశాలలు, మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఒంటికి, రొంటికి వస్తే విసర్జించే అవకాశం లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో బిగబట్టాల్సి వస్తుంది.
నిత్యం రద్దీ
గరిడేపల్లి మండల పరిధిలోని 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా గ్రామాల నుండి ప్రజలు నిత్యం వివిధ ప్రభుత్వ కార్యాలయాల పనుల నిమిత్తం వచ్చి వెళ్తుంటారు. అదేవిధంగా నేరేడుచర్ల, హుజూర్నగర్, మిర్యాలగూడ,కోదాడ, సూర్యాపేట తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు గరిడేపల్లి ప్రధాన కూడలిగా ఉండటంతో రోజూ పెద్ద ఎత్తున రద్దీ నెలకొంటుంది. అయితే మండల కేంద్రంలో సరైన ప్రజా మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళలు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గరిడేపల్లి సర్కిల్ సమీపంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న కల్మల్ చెరువు రోడ్డులో సులభ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే మండల కేంద్రంలో వెంటనే ప్రజా మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రయాణికులు, మహిళలు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.
మరుగుదొడ్లు నిర్మించాలి
గరిడేపల్లి మండల కేంద్రంలో మరుగుదొడ్లు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల నుండి ప్రజలు అనేక రకాల పనులపై ప్రయాణం చేయటానికి, వచ్చేవారు, కార్యాలయాల పనుల మీద వచ్చేవారు టాయిలెట్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వెంటటే మరుగుదొడ్లు నిర్మించి ప్రజల ఇబ్బందులు తీర్చాలని కోరుచున్నాము.
పోకల వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు






