కుక్కల బెడదతో ప్రజల్లో ఆందోళన
బెజ్జూరు పట్టణంలో గ్రామ సింహాల స్వైర విహారం
పట్టించుకోని అధికారులు
బెజ్జూరు, ఆగస్టు 26 (విజయక్రాంతి): బెజ్జూరు పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రంగా పెరుగుతోంది. గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు ప్రజలపై ఎగబడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, ద్విచక్ర వాహనదారులు రోడ్లపై వెళ్లేందుకు జంకుతున్నారు.
ఇటీవల పట్టణంలో పలువురిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ సంబంధిత అధికారులు కుక్కల నియంత్రణకు ఎలాంటి సమర్థవంతమైన చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాజాగా బుధవారం ఒకే రోజు ముగ్గురిపై కుక్కలు దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
పట్టణంలోని ప్రధాన రహదారులు, వీధులు, నివాస ప్రాంతాల్లో కుక్కల గుంపులు స్త్వ్రర విహారం చేస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాత్రివేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు.కుక్కల దాడుల ఘటనలు పునరావృతమవుతున్న నేపథ్యంలో అధికారులు ఇకనైనా స్పందించి వీధి కుక్కల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు. ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు కుక్కల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలని, మరోసారి దాడులు జరిగి ప్రాణనష్టం సంభవించకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.






