తూప్రాన్ మున్సిపల్‌లో ఇష్టారాజ్యం!
అన్ని శాఖల్లో ఇష్టానుసారంగా డ్యూటీలు
యథేచ్చగా అక్రమ కట్టడాలకు అనుమతులు ?
తూప్రాన్, ఆగస్టు 26: తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో డ్యూటీల నిర్వహణ ఇష్టారీతిగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత కమిషనర్ మారినప్పటి నుంచి ఈ విధానం అడ్డగోలుగా కొనసాగుతోందనే ఆరోపణలు చాలా ఉన్నాయి. మున్సిపల్ నిబంధనలకు విరుద్దంగా సిబ్బందిలో తనకు అనుకూలమైన వారికి విధులను అప్పగిస్తూ ఇష్టారాజ్యంగా మున్సిపల్ కార్యకలాపాలను నడిపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఇక్కడ రెవెన్యూ ఇన్స్ పెక్టర్ పోస్టు ఖాళీగా ఉన్నందున కమిషనర్ తన ఆదేశాలతో ఒక వార్డు ఆఫీసర్ కు పని కొనసాగింపు అప్పగించారు. మున్సిపల్ రూల్స్ ప్రకారం ఆర్.ఐ పోస్టు ఖాళీగా ఉన్న సందర్భంలో ఆ బాధ్యతలను జూనియర్, లేదా సీనియర్ అసిస్టెంట్ స్థాయి అధికారికి అప్పగించాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ఆఫీసులో నాలుగు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా ప్రస్తుతం ఇద్దరే ఉన్నారు. మరో ఇద్దరు డిప్యుటేషన్ పై వేరే మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లారు. అయితే ఉన్న ఇద్దరు అసిస్టెంట్లల్లో ఎవరికో ఒకరికి ఈ బాధ్యతలు అప్పగించాలి.
కానీ జూనియర్ అసిస్టెంట్ కు కాకుండా ఒక వార్డు ఆఫీసర్ కు రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాధ్యతలను అప్పగించి పనులు కొనసాగిస్తున్నారు. గత రెండు నెలల కాలంలో మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోయాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ స్థలాలున్నా, వక్ఫ్ స్థలాలున్నా సరే జాంతానై అన్నట్లు దరఖాస్తు పెట్టుకుంటే ఇంటి నంబర్లు ఇచ్చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్ ఐ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అతను తమకు సంబంధం లేని కొత్త కట్టడాలకు పర్మిషన్లు అప్రూవ్ చేయడంలాంటి సెక్షన్లను సైతం చూస్తున్నాడని ప్రచారం సాగుతోంది.
ఇక టౌన్ ప్లానింగ్ సెక్షన్ విషయానికి వస్తే అక్కడ కూడా ఒక వార్డు ఆఫీసర్ స్థాయి ఉద్యిగికి టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ డ్యూటీ అప్పగించడం జరిగింది. ఇక్కడ రెగ్యులర్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టు లేకపోవడంతో అంతా సూపర్ వైజర్ దే ఇష్టారాజ్యంగా మారిందని ఆరోపణలు ఉన్నాయి.
రెగ్యులర్ టీపీవో లేకపోవడంతో ఆ స్థానంలో గజ్వేల్ మున్సిపల్ ఆఫసు లో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ ను టీపీవోగా డిప్యుటేషన్ వేశారు. ఆమె వారంలో రెండు రోజులు ఏ సమయానికి వస్తదో ఏ సమయం పోతుందో తెలియదు. దీంతో ఇక్కడ టౌన్ ప్లానింగ్ సెక్షన్ చూస్తున్న వార్డు ఆఫీసర్ దే పెత్తనం నడుస్తోంది. ఈ పరిస్థితుల వల్ల మున్సిపల్ కార్యాలయంలో ప్రతి పనికి వసూళ్ల దందా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా కొత్తగా వచ్చిన కమిషనర్ కు తెలిసి జరుగుతుందా లేక తెలియక జరుగుతందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పరిపాలనపై దృష్టి సారిస్తాం
మున్సిపల్ కార్యాలయంలో పాత పద్ధతుల్లో కొనసాగుతోంది. ఇలాంటి విషయాలు తనదాక రాలేదని, ఇకపైన కార్యనిర్వహణ విషయంలో అన్ని శాఖలపై దృష్టి కేంద్రీకరిస్తాం.
-రమేష్ కుమార్, కమిషనర్






