సర్కారు ఆఫీసులు అస్తవ్యస్తం!
నిర్వహణ లోపం, నిర్మాణాల్లో జాప్యంతో ప్రజలకు ఇబ్బందులు
ఒక శాఖ కోసం ఒకచోట...
మరో శాఖ కోసం మరోచోట తిరుగుతున్న జనం
గుట్టపై కార్యాలయాలకు వెళ్లలేక వృద్ధులు... దివ్యాంగుల అవస్థలు
నర్సాపూర్, జూలై 26: నర్సాపూర్ పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వివిధ శాఖలకు సొంత భవనాలు ఉన్నప్పటికీ వాటి నిర్వహణలో నిర్లక్ష్యం, కొత్త భవనాల నిర్మాణంలో జాప్యం కారణంగా ప్రస్తుతం చాలా కార్యాలయాలు తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్నాయి. దీంతో నిత్యం రెవెన్యూ, న్యాయ, పురపాలక, వ్యవసాయ తదితర పనుల కోసం వచ్చే ప్రజలు ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు.
గుట్టపై తహసీల్దార్, ఆబ్కారీ కార్యాలయాలు
తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో కొత్త భవనం నిర్మిస్తామని పాత భవనాన్ని కూల్చివేశారు. అయితే నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో నీటిపారుదల శాఖ అతిథి గృహంలో తాత్కాలికంగా కొనసాగుతోంది. అలాగే ఆబ్కారీ సర్కిల్ కార్యాలయ భవనం కూడా శిథిలావస్థకు చేరడంతో దానిని కూల్చివేసి, మరో అతిథి గృహానికి తరలించారు. ఈ రెండు కార్యాలయాలు ఎత్తయిన గుట్టపై ఉండటంతో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సొంత భవనం కోసం ఎదురుచూస్తున్న ఆర్డీవో కార్యాలయం
నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయానికి ఇప్పటికీ శాశ్వత భవనం లేకపోవడంతో పశుసంవర్ధక శాఖ భవనంలోనే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. రోజూ వందలాది మంది ప్రజలు వచ్చే కార్యాలయం తాత్కాలిక భవనంలో ఉండటం అసౌకర్యంగా మారింది.
కోర్టు కోసం ఐసీడీఎస్ కార్యాలయం ఖాళీ
భారీ వర్షాలకు జూనియర్ సివిల్ కోర్టు భవనం కూలిపోవడంతో ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాన్ని కోర్టుకు కేటాయించారు. దీంతో ఐసీడీఎస్ కార్యాలయాన్ని జీవనోపాధుల శిక్షణ కేంద్రానికి, అక్కడి శిక్షణ కేంద్రాన్ని ఆర్డబ్ల్యూఎస్ డివిజన్ పాత భవనానికి తరలించారు. ఒక భవనం సమస్యతో మూడు ప్రభుత్వ కార్యాలయాలు చోటుచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పూర్తయినా ప్రారంభం కాని పురభవనం
నర్సాపూర్ పురపాలక సంఘానికి కొత్త భవనం నిర్మాణం పూర్తయినా ఇప్పటికీ కార్యాలయాన్ని అక్కడికి తరలించలేదు. ప్రస్తుతం మహిళా మండలి భవనంలోనే మున్సిపల్ కార్యాలయం కొనసాగుతోంది. కొత్త భవనం అందుబాటులో ఉన్నా వినియోగంలోకి తీసుకురాకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పాలశీతలీకరణ కేంద్రంలో వ్యవసాయ కార్యాలయం
వ్యవసాయ శాఖ ఏటీఓ కార్యాలయం ప్రస్తుతం పాలశీతలీకరణ కేంద్రం భవనంలో కొనసాగుతోంది. రైతులు తమ పనుల కోసం తాత్కాలిక భవనానికే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రజలకే భారంగా మారిన కార్యాలయాల తరలింపు
ప్రభుత్వ కార్యాలయాలు శాశ్వత భవనాల్లో కాకుండా వేర్వేరు తాత్కాలిక భవనాల్లో కొనసాగుతుండటంతో ప్రజలు ఒకే పని కోసం పలుచోట్ల తిరగాల్సి వస్తోంది. ముఖ్యంగా గుట్టపై ఉన్న కార్యాలయాలకు చేరుకోవడం వృద్ధులు, దివ్యాంగులకు కష్టంగా మారింది. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన భవనాలను వెంటనే వినియోగంలోకి తీసుకురావడంతో పాటు, కొత్త భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.






