ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి
ఎమ్మెల్యే మురళి నాయక్
కేసముద్రం, ఆగస్టు 19 (విజయక్రాంతి): ప్రజా సంక్షేమానికి, గ్రామాల అభివృద్ధికి ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ పిలుపునిచ్చారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కేసముద్రంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ సర్పంచులు అధికారుల దృష్టికి తెచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, వారు ఏదైనా సమస్యపై మాట్లాడడానికి ఫోన్ చేస్తే వెంటనే సమాధానం ఇవ్వాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని, అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు సేవకులేనన్న విషయాన్ని విస్మరించరాదన్నారు.
ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్ శాఖ అధికారి పనితీరు సరిగాలేదని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.






