ఒలింపిక్స్‌కు వినేశ్
వినేశ్ ఫొగాట్.. పరిచయం అక్కర్లేని పేరు. రింగ్‌లో తన ఉడుం పట్టుతో ప్రత్యర్థులను మట్టికరిపించే వినేశ్.. బయట కూడా తన గొంతుకను అంతే బలంగా వినిపించడంలో ముందు వరుసలో ఉంటుంది. నిన్న, మొన్నటి దాకా లైంగిక వేధింపులకు గురైన తోటి మహిళా రెజ్లర్లకు న్యాయం చేయాలంటూ రోడ్కెక్కి నిరసన తెలిపిన వినేశ్.. తాజాగా రింగ్‌లో బెబ్బులిలా గర్జించి.. ప్రతిష్ఠాత్మక
పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.
50 కేజీల విభాగంలో అర్హత n అన్షు, రితికకు కూడా పారిస్ టికెట్
బిష్కెక్ (కిర్గిస్థాన్): భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. బిష్కెక్ వేదికగా శనివారం జరిగిన ఏషియన్ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో వినేశ్ 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరి ఒలింపిక్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. వినేశ్‌తో పాటు అన్షు మాలిక్ (57 కేజీలు), రితిక హుడా (76 కేజీలు) కూడా ఫైనల్స్ చేరి పారిస్ ఒలింపిక్స్ కోటా సంపాదించారు.
ఈ టోర్నీలో ఆద్యంతం దూకుడుగా కనిపించిన వినేశ్ తన ప్రత్యర్థులకు ఒక్క పాయింట్ కూడా కోల్పోకుండా ఫైనల్‌కు చేరుకోవడం విశేషం.ఇక వినేశ్‌కు సులువైన డ్రా లభించడంతో ప్రత్యర్థ్థులను మట్టికరిపించడానికి పెద్ద సమయం పట్టలేదు. తొలి రౌండ్‌లో కొరియాకు చెందిన తన ప్రత్యర్థి మిరాన్ చియాన్‌ను కేవలం నిమిషం 39 సెకన్ల వ్యవధిలోనే మట్టికరిపించింది. వినేశ్ ఉడుం పట్టుకు చియాన్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఇక రెండో రౌండ్‌లో కంబోడియాకు చెందిన మనాంగ్ దిత్‌ను కేవలం 67 సెకన్లలోనే ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది.
సెమీస్‌లో 19 ఏళ్ల కజకిస్థాన్ రెజ్లర్ లారా గనికిజీ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికి అటాకింగ్ గేమ్‌తో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా 4 బౌట్‌ను ముగించి ఫైనల్లో అడుగుపెట్టి పారిస్ టికెట్ అందుకుంది. ఇక ఫైనల్లో వినేశ్.. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన అక్టెంగె కెయునిమ్జేవాను ఎదుర్కోనుంది. కాగా వినేశ్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించడం ఇది మూడోసారి. గతంలో రియో ఒలింపిక్స్ (2016), టోక్యో ఒలింపిక్స్ (2020) నేరుగా అర్హత సాధించింది. ఇక 53 కేజీల విభాగంలో అంతిమ్ పంగల్ ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ కోటాను దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో రెజ్లింగ్ విభాగంలో వివిధ కేటగిరీల్లో భారత్ నుంచి నలుగురు రెజ్లర్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించినట్లయింది.






