తూకాల్లో లోపాలు లేకుండా కొనుగోలు జరగాలి
కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్.
అచ్చంపేట: వరి మొక్కజొన్న కొనుగోళ్లలో ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ జరగాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని చందాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం నాణ్యత, తూకాల విధానం, రికార్డుల నిర్వహణ, నిల్వ సదుపాయాలు, హమాలి, రవాణా ఏర్పాట్లను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. హమాలి కొరత, రవాణా ఆలస్యం వంటి సమస్యలను రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రతి గింజకు సరైన మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటోందన్నారు. రైతులు ఎక్కువసేపు వేచి ఉండకుండా త్వరితగతిన ధాన్యం స్వీకరణ చేపట్టాలని సూచించారు. ధాన్యం కొనుగోలు పూర్తైన వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లో చెల్లింపులు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ, కూర్చునే సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ధాన్యం నిల్వలో నాణ్యత దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రవాణా ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. ఈ తనిఖీలో అచ్చంపేట ఆర్డీవో యాదగిరి తదితర అధికారులు పాల్గొన్నారు.






