హిందీ మార్కెట్లో పుష్పరాజ్ రికార్డు
అల్లు అర్జున్, రష్మిక మందన్న నాయకానాయికలుగా సుకుమార్ తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప2 : ది రూల్’. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న విడుదలైంది. తాజాగా మరో రికార్డు ఈ సినిమా ఖాతాలో పడ్డది. హిందీ మార్కెట్లో సుమారు 10 రోజుల వ్యవధిలోనే రూ.507.50 కోట్ల నెట్ కలెక్షన్లు వసూలు చేసింది.
తద్వారా హిందీలో అత్యంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్‌లో ప్రవేశించిన సినిమాగా రికార్డు నెలకొల్పిందని చిత్రబృందం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1292 కోట్లతో ఆల్ టైమ్ హయ్యస్ట్ గ్రాస్‌ను వసూలు చేసిందీ సినిమా.
చిరంజీవిని కలిసిన అల్లు అర్జున్
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అరెస్టు అయిన అల్లు అర్జున్.. మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌ను సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. తాజాగా ఆయన తన మేనమామ, నటుడు చిరంజీవి ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం మధ్యాహ్నం చిరంజీవి నివాసానికి చేరుకున్న బన్నీ సుమారు గంట పాటు అక్కడే గడిపారు. తాజా పరిణామాలపై ఇరు కుటుంబాలు చర్చించుకున్నట్టు సమాచారం. మరో మేనమామ నాగబాబు ఇంటిని సైతం అల్లు అర్జున్ సందర్శించారు.






