1 May, 2026 | 4:07 AM

ట్రంప్‌నకు పుతిన్ వార్నింగ్

01-05-2026 01:44 AM

ఇరాన్‌పై మళ్లీ సైనిక చర్యకు దిగొద్దు

90 నిమిషాలకుపైగా ఫోన్‌లో ఇరుదేశాల అధినేతల చర్చ

ఇరాన్ యురేనియం విషయంలో పుతిన్ సాయం: ట్రంప్

వాషింగ్టన్, ఏప్రిల్ 30: ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి హెచ్చరికలు చేశా రు. టెహ్రాన్‌పై మళ్లీ సైనిక చర్యకు దిగితే.. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని పుతిన్ హెచ్చరించారు. ఈ ఇద్దరి మధ్య సంభాషణ గురించి రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ సహాయకుడు యూరీ ఉషాకోవ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ఇరుదేశాల నేతలు 90 నిమిషాలకుపైగా ఫోన్‌లో మాట్లాడుకున్నారని పేర్కొన్నారు.

ఇరాన్ కాల్పుల విరమణ పొడిగించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని వ్లాదిమిర్ పుతిన్  స్వాగతించారని ఉషాకోవ్ తెలిపారు. ఈ చర్యతో దౌత్య చర్చల కు మార్గం సుగమమవుతుందని వెల్లడించిన ట్లు పేర్కొన్నారు. ఒకవేళ అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి ఇరాన్‌పై దాడులకు దిగితే.. పశ్చిమాసియాతో సహా మొత్తం అంతర్జాతీయ సమాజం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పుతిన్ హెచ్చరించినట్లు వెల్లడించారు. ఇరాన్‌తో ఉద్రిక్తతలు ముగించడానికి దౌత్య ప్రయత్నాలకు రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ పునరుద్ఘాటించారన్నారు.

ఉక్రెయిన్ సరిహద్దు వెంబడి పరిస్థితుల గురించి ఇరుదేశాల నేతలు చర్చించుకున్నట్లు తెలిపారు. పుతిన్ సంభాషణలో ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వల గురించి మాట్లాడుకున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఈ నిల్వలను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ పేర్కొన్నట్లు వెల్లడించారు. 

అయితే, ‘మీరు నాకు సహాయం చేసే ముందు, నేను మీ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నా’ అని తాను బదులిచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా త్వరలో ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణకు అవకాశం ఉందని సంకేతాలిచ్చారు. రష్యా అధ్యక్షుడు కొద్ది రోజుల కాల్పుల విరమణను సూచించారని, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడవచ్చని ట్రంప్ తెలిపారు.