11-09-2025 08:48:20 AM
ఉదయాన్నే లైన్ లో నిలుచున్న రైతన్నలు
ఒక్క బస్తా ఎలా సరిపోతుందని రైతుల ఆవేదన
చిట్యాల(విజయక్రాంతి): పది ఎకరాలు సాగు చేస్తున్న రైతులకు ఒక్క యూరియా(Urea) బస్తా ఎలా సరిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) చిట్యాల మండలకేంద్రంలోని ఓడిసిఏంఎస్ ఎరువుల దుకాణం వద్ద ఉదయాన్నే యూరియా కోసం రైతులు బారులు తీరారు. తెల్లవారుజామున ఎరువుల దుకాణానికి యూరియా బస్తాలు వచ్చాయని సమాచారంతో ఎరువుల విక్రయకేంద్రానికి వెళ్లినట్లు రైతులు తెలిపారు.కేవలం ఒక్కో రైతుకు ఒకటి,రెండు బస్తాల యూరియా మాత్రమే అందిస్తున్నారని తెలిపారు.
క్యూలైన్లో నిలుచోవడం వల్ల వ్యవసాయ పనులను చేసుకోలేకపోతున్నామని వాపోయారు.యూరియా సరైన సమయంలో పంటలకు అందించకపోవడం వల్ల పంటలపై తీవ్రప్రభావం చూపి దిగుబడి తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఎన్నడు యూరియా కొరత రాలేదని,సకాలంలో యూరియా అందజేసి ఆదుకున్నారని రైతుల గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ యూరియా కష్టాలు మొదలైనయని రైతులు పేర్కొన్నారు. ఇప్పటికైనా రైతుల కష్టాలను అర్థం చేసుకొని సరిపడ యూరియాను అందించాలని రైతులు వేడుకుంటున్నారు.