24 August, 2026 | 1:37 AM

అక్రమంగా తరలిస్తున్న 600 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

24-08-2026 12:37 AM

భద్రాచలం, ఆగస్టు 23 (విజయక్రాంతి):  పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు చేరాల్సిన బియ్యం అక్రమ మార్గంలో రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది. కేవలం15  రోజుల వ్యవధిలోనే రెండు లారీల రేషన్ బియ్యాన్ని పోలీసులు, సివిల్ సప్లై అధికారులు పట్టుకోవడం కలకలం రేపుతోంది. 15 రోజులకు క్రితం ఒక లారీ, శనివారం రాత్రి మరో లారీని అధికారులు పట్టుకున్నారు.

రెండు వేర్వేరు ఘటనల్లో పట్టుబడిన లారీల్లో కలిపి సుమారు 600 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరువూరు, జగ్గయ్యపేట ప్రాంతాల నుంచి భద్రాచలం మీదుగా ఒడిశా రాష్ట్రానికి ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. పేదల కోసం ప్రభుత్వం కేటాయించిన రేషన్ బియ్యం దళారుల చేతులు మారి. అక్రమ వ్యాపారంగా మారుతున్న పరిస్థితిపై అనేక అనుమానాలు   వ్యక్తమవుతున్నాయి.

అధికారులు పట్టుకున్న ఈ రెండు లారీలే కాకుండా... ఇంకా ఎన్ని వాహనాలు ఇదే మార్గంలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భద్రాచలం ప్రాంతం ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు సమీపంలో ఉండటంతో... సరిహద్దు మార్గాలను అక్రమ రవాణాదారులు వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో రాష్ట్ర సరిహద్దుల్లో మరింత కట్టుదిట్టమైన తనిఖీలు, నిరంతర నిఘా అవసరమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఇంతకాలంగా రేషన్ బియ్యం తరలింపును ఎవరు నిర్వహిస్తున్నారు? పట్టుబడిన బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి తరలిస్తున్నారు? అన్న కోణాల్లో అధికారులు లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం  దళారుల జేబులు నింపే వ్యాపారంగా మారకుండా ప్రభుత్వం, అధికారులు మరింత అప్రమత్తం కావాల్సిన పరిస్థితి నెలకొంది.