24 August, 2026 | 2:07 AM

అసెంబ్లీని స్తంభింపజేస్తాం

24-08-2026 01:34 AM
  1. 22ఏ జాబితాను రద్దు చేయకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తాం
  2. కాంగ్రెస్ పార్టీ మాడి మసైపోవడం ఖాయం
  3. మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, ఆగస్టు 23(విజయక్రాంతి): 22ఏ జాబితాను తక్షణమే రద్దు చేయకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తామని, సచివాలయాన్ని ముట్టడిస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. ప్రజల ఆస్తులను లాక్కుంటే కాంగ్రెస్ పార్టీ మాడి మసైపోవడం ఖాయమన్నారు. రేవంత్‌రెడ్డి, పొంగులేటి రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే రాహుల్ గాంధీ చోద్యం చూస్తున్నారా? అని ప్రశ్నిం చారు. 30 శాతం కమీషన్ల కోసమే పక్కా రిజిస్టర్డ్ ఇళ్లను నిషేధిత జాబితాలో సర్కారు పెడుతోందని విమర్శించారు. భూభారతి పోర్టల్ నుంచి 22ఏ జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు? పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలి అని డిమాండ్ చేశారు.

బోడుప్పల్ 22ఏ బాధి తులకు బాసటగా బీఆర్‌ఎస్ పోరాడుతుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. బోడుప్పల్ పరిధిలోని తిరుమల మెడోస్, లక్ష్మీగణపతి, హేమా నగర్ కాలనీలను ప్రభుత్వం అకారణంగా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన నేపథ్యంలో.. తీవ్ర ఆందోళనలో ఉన్న ఆయా కాలనీల వాసు లకు బాసటగా నిలిచేందుకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..

రాత్రికి రాత్రే ఇళ్లను యూఎల్‌సీ కింద 22ఏలో దేనికోసం పెడుతున్నారు? ఇదంతా కేవలం 30 శాతం కమీషన్లు లాగడానికేనని ఆరోపించారు. ‘తప్పు చేసి నిషేధిత జాబితాలో పెట్టింది మీరు.. మీ కమీషన్ల కోసం చేసిన తప్పుకు సామాన్య ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ఎందుకు తిరగాలి? ఇది కాంగ్రెస్ ప్రభుత్వ తుగ్లక్ చర్య’ అని అన్నారు.  తక్షణమే ఈ సమస్య పరిష్కరిస్తారా? లేక ప్రజల పాదాల కింద నలిగిపోతారో తేల్చుకోం డని హెచ్చరించారు. కాంగ్రెస్ హైకమాండ్ ఈ రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో పెట్టింది. ఇటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులేనని, ఇదంతా చూస్తూ రాహుల్ గాంధీ చోద్యం చూస్తున్నారా? అని విమర్శించారు.