calender_icon.png 6 October, 2025 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుగు ప్రయాణానికి తిప్పలు రైళ్లు, బస్సుల్లో కిక్కిరిసిన జనం

06-10-2025 01:25:44 AM

మహబూబాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): దసరా సెలవులకు పట్టణాల నుండి పల్లెలకు వచ్చిన జనం తిరుగు ప్రయాణానికి అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం హైదరాబాద్ తోపాటు ఇతర పట్టణాలకు వెళ్లేందుకు రైళ్లు, బస్సులు ప్రయాణికులకు తగ్గట్టుగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కేసముద్రం రైల్వే స్టేషన్లో గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కలేక అనేకమంది ఆర్టీసీ బస్సులకు కోసం నిరీక్షించాల్సి వచ్చింది. అలాగే ఉదయం నుండి సాయంత్రం వరకు ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. అనేక రైళ్లకు జనరల్ బోగీలు తక్కువగా ఉండడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.

ఆర్టీసీ బస్సులు కూడా ప్రయాణికులతో నిండిపోయాయి. దీనితో చాలాచోట్ల పట్టణాలకు వెళ్లే ప్రజలు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకొందరు సోమవారం విధుల్లో చేరడానికి ఇబ్బందిగా మారుతుందని తిప్పలు పడుతూనే కిక్కిరిసిన రైళ్లలో ప్రయాణించారు. రైల్వే స్టేషన్ లతోపాటు బస్ స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి.