15 August, 2026 | 3:02 PM

ప్రతిఒక్కరికీ న్యాయం పొందే హక్కు... పేదలకు ఉచిత సాయం

15-08-2026 02:17 PM

పేదలకు ఉచిత సాయం 

న్యాయమూర్తులు ఎస్.సంతోష్ కుమార్, వి.తరుణి

సిద్దిపేట క్రైం,ఆగస్టు 15(విజయక్రాంతి): ప్రతిఒక్కరికీ న్యాయం పొందే హక్కును రాజ్యాంగం కల్పించిందని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ న్యాయ సహాయానికి దూరం కాకూడదని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్.సంతోష్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ,  సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి,  న్యాయసేవాధికార సంస్థ జిల్లా చైర్ పర్సన్ జి.సుదర్శన్ ఆదేశానుసారం సిద్దిపేటలోని ప్రభుత్వ బాలుర, బాలికల పాఠశాలల్లో శనివారం "అందరికీ న్యాయానికి ప్రాప్యత ఉచిత న్యాయ సహాయం" అనే అంశంపై లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు.

బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జడ్జి ఎస్.సంతోష్ కుమార్ మాట్లాడుతూ, అర్హులైన వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం, న్యాయ సలహా, ఇతర సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్సు కౌన్సెల్ ఎం.రవికుమార్, ప్రిన్సిపాల్ సీహెచ్ శ్రీనివాస్ రెడ్డి, న్యాయసేవధికర సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఒకటో అదనపు జూనియర్ సివిల్ జడ్జి వి.తరుణి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉచిత న్యాయ సహాయం పొందే విధానం, న్యాయపరమైన హక్కులపై విద్యార్ధులకు వివరించారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్సు కౌన్సెల్ డిప్యూటీ చీఫ్ సీహెచ్.శరత్ బాబు, ప్రిన్సిపాల్ ఎన్.మనోహర్, న్యాయసేవాధికార సిబ్బంది పాల్గొన్నారు.