రాముడి వారసుడు రాహుల్‌గాంధీయే
l రామరాజ్యం ఆయనతోనే సాధ్యం
l రాహుల్‌ను విమర్శించే అర్హత ఈటలకు లేదు
l మోదీ కూడా ఒకప్పుడు సీల్డ్ కవర్ సీఎం
l టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 21(విజయక్రాంతి): దేశంలో శ్రీరాముడి పాలన కావాలంటే రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. రాముడి ఆదర్శాలను నిలబెట్టే వ్యక్తి ఒక్క రాహుల్‌గాంధీ మాత్రమేనని.. అది బీజేపీ, ప్రధాని మోదీతో సాధ్యంకాదని ఆయన వ్యాఖ్యానించారు. 65 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రూ.56 లక్షల కోట్ల అప్పు ఉంటే.. మోదీ పదేళ్లలో రెండింతలు చేశారని మండిపడ్డారు. గాంధీభవన్‌లో ఆదివారం మాట్లా డుతూ.. పేదల కోసం శ్రీరాముడు పాలన చేశారు. ఇప్పుడు పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆలోచన చేసేది రాహుల్ గాంధీయే. రాముడికి నిజమైన వారసుడు రాహుల్‌గాంధీ.
గుడి నిర్మాణంతో రాముడు సంతోషించడు. సమస్యలు పోవు. బీజేపీ నేత లు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ రాజకీయంగా బతకాలంటే జైశ్రీరాం అనక తప్పదు అని జగ్గారెడ్డి అన్నారు. రాహుల్‌గాంధీపై ఈటల విమర్శలు చేయ డం తగదన్నారు. రాహుల్ ముందు ఈటల రాజకీయ జీవితం చాలా చిన్నదని.. ఆయన చరిత్ర, రాజకీయం మీద బీజేపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
దేశ రాజకీయాలు రాహుల్‌గాంధీ, మోదీ చుట్టే తిరుగుతున్నాయని, కానీ ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు. అద్వాణీ రథయాత్ర సమయంలో మోదీ ఎవరో కూడా తెలియదని, గుజరాత్‌లో ఎమ్మెల్యేగా గెలిస్తే సీల్డ్ కవర్‌లో సీఎంగా బీజేపీ ప్రకటించిందని జగ్గారెడ్డి విమర్శించారు. మోదీని సీల్డ్ కవర్ సీఎం కాదని చెప్పగలరా? అని ప్రశ్నించారు. మోదీ ప్రధాని కాకముందు ఏ పోరాటం చేశారో బీజేపీ నేతలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
రాహుల్ మాత్రం ప్రజల కోసం పోరాటే ఫైటర్ అని, యూపీఏ ప్రభుత్వంలో ప్రధానిగా అవకాశం వచ్చినా తీసుకోలేదని, అదే మోదీ పవర్ కోసమే వచ్చిన లీడర్ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేందుకు భారత్ జోడో యాత్ర చేశారని, ఆయనకు ప్రధాని అయ్యే అవకాశం ప్రజలు ఇవ్వాలన్నారు. తెలంగాణ నుంచి 14 మంది కాంగ్రెస్ ఎంపీలను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సీట్ల కేటాయింపుల్లో సమస్యలు తప్పవని, కొందరికి అన్యాయం జరగవచ్చని పేర్కొన్నారు.






