29 July, 2026 | 12:51 AM

ఢిల్లీ జంతర్ మంతర్ సాక్షిగా రాహుల్ గాంధీ బూటకపు డ్రామాలు

29-07-2026 12:00 AM

ఓటర్ల జాబితా ప్రక్షాళన దెబ్బకు కాంగ్రెస్ విలవిల..

దొంగ ఓట్లు గల్లంతవుతున్నాయనే భయంతోనే గగ్గోలు..

అటు ఢిల్లీలో రాహుల్ ఫ్లాప్ షో.. ఇటు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి వైఫల్యాలు..

ఖమ్మం వేదికగా కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి..

ఖమ్మం, జూలై 28 (విజయక్రాంతి): ఢిల్లీలోని జంతర్మంతర్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న నిరసనలు రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న బూటకపు డ్రామాలేనని బీజేపీ జాతీయ నాయకుడు, కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల ఇన్చార్జి డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియతో దొంగ ఓట్లు తొలగిపోతున్నాయనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మంగళవారం ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావుతో కలిసి డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి పరిశీలించారు.

అంతకుముందు ఖమ్మం నగరంలోని రోటరీ నగర్ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జంతర్మంతర్ వేదికగా కాంగ్రెస్ చేపడుతున్న దీక్షలు, నిరసనలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కావని, రాజకీయ ప్రచారం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాలేనని పొంగులేటి అన్నారు.

ప్రజల మద్దతు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ కెమెరాల ముందు కనిపించేందుకు మాత్రమే ఆందోళనలను ఆశ్రయిస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రజలకు ఉపయోగపడే ప్రత్యామ్నాయ విధానాలు లేవని, దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా నకిలీ, అక్రమ ఓటర్లు జాబితా నుంచి తొలగిపోతుండటంతో కాంగ్రెస్లో ఆందోళన మొదలైందన్నారు.

దశాబ్దాలుగా పెరిగిన దొంగ ఓట్ల వ్యవస్థకు చెక్ పడుతోందనే భయంతోనే ఎస్‌ఐఆ్ప నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. నిజమైన ఓటర్ల హక్కులను పరిరక్షించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని, ఖమ్మం జిల్లాలో దీనికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని డాక్టర్ పొంగులేటి ఆరోపించారు. ఆరు గ్యారంటీలు, ఇతర ఎన్నికల హామీలు అమలులోకి రాకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి మందగించిందని, శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందని, ప్రభుత్వం కేవలం ప్రచార ఆర్భాటాలు, రాజకీయ కక్షసాధింపులకే పరిమితమైందని విమర్శించారు.

జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలకు పాల్పడుతున్నారని పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కంటే రాజకీయ లబ్ధిపైనే కాంగ్రెస్ దృష్టి కేంద్రీకరించిందని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు గోంగూర వెంకటేశ్వరరావు, రుద్ర ప్రదీప్, గుత్తా వెంకటేశ్వర్లు, నున్న రవికుమార్, శీలం పాపారావు, శాసనాల సాయిరాం, శ్యామ్ రాథోడ్, పమ్మీ అనిత, తదితరులు పాల్గొన్నారు.