26 July, 2026 | 4:48 AM

రాహుల్‌గాంధీయే ప్రధాని

01-06-2024 02:35 AM

కూటమికి నాయకుడు ఆయనే

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే

న్యూఢిల్లీ, మే 31: ఇండియా కూటమి తరఫున దేశ ప్రధానిగా రాహుల్‌గాంధీకే తన మద్దతు ఉంటుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఉద్ఘాటించారు. బీజేపీ ప్రభుత్వం పోతే ఇదే జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రియాంక గాంధీ వాద్రా కూడా పోటీలో నిలబడాలని తాను కోరినట్లు ఖర్గే వెల్లడించారు. సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించిన స్థానాల్లో గాంధీ కుటుంబం పోటీ చేస్తేనే ఫలితం ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా రెండు జోడో యాత్ర లకు రాహుల్‌గాంధీ నాయకత్వం వహించారని, ప్రధాని మోదీపై ప్రతిదాడి చేశారని ఖర్గే పేర్కొన్నారు. ప్రధానిగా రాహుల్‌గాంధీనే నేను ప్రతిపాదిస్తా.

ఆయనొక్కడే నా ఆప్షన్. యువతకు ప్రాతినిధ్యం వహిస్తారు. దేశవ్యాప్తంగా ఆయనకు మద్దతు ఉంది. చాలా మంది ఆయననే తర్వాత ప్రధానిగా చూస్తున్నారు అని పేర్కొన్నారు. అయితే, ఇండియా కూటమి కలిసి పోరాడుతోందని, ఫలితాల తర్వాత ప్రధానమంత్రి ఎవరనేది అందరం కలిసి నిర్ణయం తీసుకుంటామని ఖర్గే స్పష్టం చేశారు. కౌన్ బనేగా కరోడ్‌పతి అంటూ ఇండియా కూట మి ప్రధాని ఎవరంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఖర్గే ఈ వివరణ ఇచ్చారు. గత వారంలో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే, ఇండియా కూటమిలో పార్టీల మధ్య చాలా వ్యతిరేకత ఉంది.

ఎవరూ ప్రధాని అభ్యర్థిగా ఉంటారనే చర్చ నడుస్తోంది. కానీ, తొలుత కూటమికి ప్రాధాన్య మిచ్చిన బీహార్ సీఎం నితీశ్‌కుమార్ ఎన్‌డీఏలో చేరారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒంటరిగా పోటీ చేస్తామని కూటమికి పెద్ద షాక్ ఇచ్చారు. కూటమికి నిజమైన నాయకుడి పట్ల ప్రజల్లో అనుమానాలు రేకిత్తిస్తున్నాయి.  కాంగ్రెస్‌కు 128 స్థానాల్లో గెలుస్తుందని, కూటమి పార్టీలతో కలిసి అధికారంలోకి వస్తామని ఎన్‌డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖర్గే ధీమా వ్యక్తం చేశారు.