02-05-2025 12:00:00 AM
ముషీరాబాద్, మే 1 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఒత్తిడి తీసుకువచ్చిన నేపథ్యంలోనే మోడీ ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన కూడా ప్రకటించారని జాతీయ ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఫోరం ఆధ్వర్యంలో గురువారం హైదర్ గూడ కూడలిలో ఉన్న జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆళ్ల మాట్లాడుతూ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశంలో ఉన్న ప్రజలందరిని ఐక్యం చేస్తూ కులగణన ప్రాముఖ్యతని ప్రచారంలో ప్రజలకు వివరిస్తూ దేశ వ్యాప్తంగా జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్‌తోనే కేంద్రం తలొగ్గిందన్నారు.
ఈ ప్రక్రియను ఎలాంటి అవకతవకలకు తావు ఇవ్వకుండా, వేగవంతం చేయాలని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చిన లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీసీ ఆజాద్ ఐకాస ఛైర్మన్ బత్తుల సిద్దేశ్వర పటేల్ కాంగ్రెస్ సీనియర్ నేత రామన్ గౌడ్, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.