23 May, 2026 | 11:06 PM

యువతకు స్థానమెక్కడ?

21-08-2024 06:20 AM

మొదటి లోక్‌సభలో 30 శాతం ప్రాతినిథ్యం

  1. ప్రస్తుతం 10 శాతానికే యువత పరిమితం
  2. 90 కోట్లకు పైగా జనాభా.. 90 మందే యువ ఎంపీలు
  3. కనీస పోటీ వయసు 21 ఏళ్లకు తగ్గించాలని డిమాండ్

స్వాతంత్య్రం వచ్చి 78 ఏండ్లు   గడుస్తున్నా చట్టసభల్లో యువతకు సరైన ప్రాతినిథ్యం లభించడం లేదు. ప్రపంచం లోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశంగా ఇండియాకు పేరుంది. యువ జనాభానే మన దేశానికి గొప్ప వనరు అని చాలా మంది మేధావులు అభివ ర్ణిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న యువతలో మెజార్టీ శాతం ఉపాధి కోసం చూస్తున్నవారే. కానీ దేశంలోని యువత తాము కోరుకుంటున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏం చేస్తు న్నారు లేదా లక్ష్య సాధనలో విఫలం కావడానికి గల కారణాలపై చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుత యువత ఆలోచనా సరళికి తగ్గట్టు ప్రభుత్వాలు కూడా వారికి వివిధ రంగాల్లో నైపుణ్యం కల్పించి ఉపాధి కల్పించాలని మాత్రమే ఆలోచిస్తున్నాయి.

అయినప్పటికీ దేశంలో నిరుద్యోగుల శాతం నానాటికీ పెరిగిపోతున్నది. దీనికి ప్రధానం కారణం నిర్ణయాత్మక స్థితిలో యువత లేకపోవడమే. ప్రస్తుతం చట్టాలను అనుసరించే స్థాయిలోనే ఉండడంతో యువత ఇంకా నిర్వీర్యమవుతున్నది. కానీ చట్టాల రూపకల్పన, అమలులో వారి ప్రాతినిథ్యం పెరిగినప్పుడే వారికి కావాల్సిన హక్కులను వారు సాధించుకోగలరు. రోజు రోజుకు చట్ట సభల్లో యువత ప్రాధాన్యత దిగజారిపోతుంది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి లోక్‌సభలో యువత ప్రాతినిధ్యాన్ని గమినిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 

హైదరాబాద్, ఆగస్టు 20 (విజయ క్రాంతి): దేశంలో ప్రస్తుతం యువ జనాభా 90 కోట్లకు పైగా ఉంటుంది. అన్ని రంగాల్లోనూ రాణిస్తున్న యువత రాజకీయం రంగంలో మాత్రం వెనుకబడుతున్నది.  ప్రస్తుత లోక్‌సభలో 543 మంది ఎంపీలుండగా అందులో 45 ఏళ్ల లోపు ఉన్న వారు కేవలం 90 మంది మాత్రమే. అంటే 90 కోట్లకు పైగా యువ జనాభా తరపున లోక్‌సభలో ప్రాతినిథ్యం వహించేందుకు కేవలం 90 మంది యువ ఎంపీలు మాత్రమే ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చట్టాల రూపకల్పనలో యువతకిచ్చే ప్రాధాన్యత ఏమిటో ఈ గణాంకాలు చూస్తే అర్థమవుతుంది.

భారతదేశంలో 35 ఏళ్ల కంటే తక్కువ వయసున్న జనాభా 65 శాతం ఉన్నది. 25 ఏళ్ల లోపువారు 50 శాతం ఉన్నారు. అయినప్పటికీ చట్టసభల్లో ప్రాతినిథ్యం పొందలేకపోతున్నారు. దీంతో చట్టసభల్లోని వయసు మళ్లిన నాయకుల దిశానిర్దేశంలో యువ భారతం ముందుకు నడుస్తున్నది. 1952 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు లోక్‌సభలో యువతకున్న ప్రాతినిథ్యాన్ని గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ పరిస్థితి చట్ట సభల్లోనూ యువత ప్రాతినిథ్యం పెరిగి చట్టాల రూపకల్పనలో కీలక వ్యవహరించినప్పుడే యువ భారతానికి సరైన అర్థం ఉంటుంది. 

పార్టీలూ బాధ్యత వహించాలి...

దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ, ప్రాంతీయ ప్రధాన పార్టీలన్నింటికీ విద్యార్థి విభాగాలు, యువజన విభాగాలున్నాయి. కానీ ఆ విభాగాల నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రం యువతకు తగిన అవకాశం లభించడం లేదు. ఒక రకంగా చట్టసభల్లో యువత ప్రాతినిథ్యం తగ్గిపోవడానికి ప్రధాన కారణం మాత్రం ఇదే. ప్రత్యక్ష ఎన్నికల్లో విద్యార్థి విభాగాలను, యువజన విభాగాలను కేవలం కార్యకర్తల్లాగా మాత్రమే పార్టీలు గుర్తిస్తున్నాయి. పోటీ చేసేందుకు వారికి తగిన ప్రాధాన్యం కల్పించడం లేదు.

ప్రత్యక్ష ఎన్నికల్లో వయసు మళ్లిన నాయకులు పోటీ చేస్తే, పార్టీపరమైన పదవులు, వీలైతే నామినేటెడ్ పదవులు.. అందులోనూ ప్రాధాన్యత లేని పదవులను యువతకు కేటాయిస్తున్నారు. అన్ని రంగాల్లో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని ప్రగల్భాలు పలికి పార్టీలన్ని రాజకీయంగా యువతను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఇప్పటికైనా పార్టీలన్ని ప్రత్యక్ష ఎన్నికల్లో యువతకు తగిన ప్రాధాన్యత కల్పించి, చట్టసభల్లో వారి ప్రాతినిథ్యం పెరిగేందుకు తోడ్పాటునందించాలని మేధావులు అభిప్రాయపడుతున్నారు. 

పోటీ వయసు తగ్గించరెందుకు?...

 దేశంలో ఎన్నికల్లో ఓటు వేసేందుకు కావాల్సిన కనీస వయసు 18 ఏండ్లు. కానీ పోటీ చేసేందుకు కావాల్సిన కనీస వయసు మాత్రం 25 ఏండ్లుగా రాజ్యాంగంలో పొందుపర్చారు. యువత రాజకీయ ఉపాధి పొందడంలో వెనుకబడటానికి ఇది కూడా ఒక కారణమే అవుతుంది. రాజకీయం పార్టీల గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో యువతకు ఓటు బ్యాంకు ఉన్నా వారికి పోటీ చేసేందుకు సరైన అవకాశం లేదు. 18 ఏండ్లకు ఎన్నికల్లో ఓటు వేసి సరైన నాయకుడిని ఎన్నుకునేంత జ్ఞానం ఉన్న యువతకు పోటీ చేసి ప్రజా సేవ చేయటానికి అవకాశం ఎందుకు కల్పించరనే ప్రశ్నలు తలెత్తున్నాయి.

ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి... సరైన నాయకుడిని ఎన్నుకోవాలని ప్రచారం చేసే ప్రభుత్వాలు... ఎన్నికల్లోనూ పోటీ చేయండి అని మాత్రం యువతలో అవగాహన కల్పించడం లేదు. ఈ కారణంగా ఓటు హక్కు వచ్చినవారు దానిని వినియోగించుకోకపోగా... కొందరు ఓటు హక్కును తీసుకోవడానికి కూడా ఆసక్తి చూపించడం లేదు. ఓటు వేయాలి... పోటీ చేయాలని ఆసక్తి పెరగాలంటే బాధ్యత పెరగాలి.

బాధ్యత పెరగాలంటే భాగస్వామ్యం పెరగాలి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే వయసును 21 ఏండ్లుకు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో వారి రిటైర్‌మెంట్ వయసును పెంపును సులభంగా చేస్తున్న ప్రభుత్వాలు... రాజకీయంగా ఉపాధి పొందాలనుకునే యువతకు పోటీ చేసే వయసును మాత్రం తగ్గించడం లేదని ప్రశ్నిస్తున్నారు. 

మొదటి లోక్‌సభలో 30 శాతం...

స్వాతంత్య్రం తరువాత నిర్వహించిన మొదటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాతినిథ్యం పొందిన 25 ఏళ్లలోపు యువత కేవలం 30.30 శాతంగా ఉంది. అప్పటి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో  యువత ప్రాతినిథ్యం క్రమంగా తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం ఇది 10.68 శాతానికి దిగజారిపోయింది. అయితే 1952 సంవత్సరంలో 25 ఏళ్ల మధ్య వయసు గల వారి జనాభా 22.25 శాతంగా ఉంటే ప్రస్తుతం అది 25.76 శాతానికి పెరిగింది. భాతరదేశ గణాంకాల ప్రకారం ప్రతియేటా యువ జనాభా పెరిగినా లోక్‌సభలో ప్రాతినిథ్యం మాత్రం పెరగడం లేదు. 1952లో లోక్‌సభలో ఎంపీల సగటు వయసు 46 ఏళ్లుగా ఉంటే ప్రస్తుతం 55 ఏళ్లకు చేరింది. దీని బట్టి చూస్తే ఏ స్థాయి చట్టసభల్లో యువతకు ప్రాధాన్యత లభిస్తున్నదో తెలుస్తుంది. ప్రస్తుత లోక్‌సభలో మొత్తం 543 మంది 40 ఏళ్ల లోపు వయసున్న ఎంపీలు కేవలం 48 మంది మాత్రమే. అంటే మిగిలిన 495 మంది ఎంపీలు 40 ఏళ్లకు పైబడిన వారే ఉన్నారు.