05-07-2025 02:09:28 AM
69 మంది మృతి.. దాదాపు 700 కోట్ల నష్టం
సిమ్లా, జూలై 4: హిమాచల్ ప్రదేశ్ భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో అతలాకుతలమవుతోంది. ఈ వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 69 మంది మరణించగా.. 37 మంది గల్లంతయ్యారు. మరణించిన వారిలో ఎక్కువగా మండి జిల్లా నుంచి 17 మంది, కాంగ్రాలో 13 మంది, చంబాలో ఆరుగురు, సిమ్లాలో ఐదుగురు ఉన్నారు. ఈ నెల 7 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
కాగా వరదల కారణంగా ఇప్పటివరకు దాదాపు రూ. 700 కోట్లు నష్టం వాటిల్లిందని రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ అధికారులు తెలిపారు. కాగా వరద బీభత్సం మండిలో ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడి తునాగ్, బాగ్సాయెద్‌లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి.
ఈ జిల్లా నుంచే దాదాపు 40 మంది ఆచూకీ గల్లంతయ్యింది. వరదల కారణంగా వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయని, 14 వంతెనలు కొట్టుకుపోయాయని అధికారులు పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లు తెగిపోవడంతో రవాణాకు కష్టతరంగా మారింది. వరదల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.