05-07-2025 02:08:06 AM
చైనా వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ
ఢిల్లీ, జూలై 4: దలైలామా వారసుడి ఎంపిక నిర్ణయంపై భారత్ జోక్యం చేసుకోవడం తగదంటూ చైనా పేర్కొనడంపై భారత ప్రభుత్వం స్పందించింది. మత విశ్వాసాలు, ఆచారాల్లో భారత్ ఎప్పుడూ జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది. దీర్ఘ కాలంగా ఇదే వైఖరిని కొనసాగిస్తున్నామని పేర్కొంటూ విదేశాంగశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ..
తన వారసత్వం గురించి ప్రస్తుతం దలైలామా ప్రకటనకు సంబంధించిన నివేదికలు చూశామన్నారు. అటువంటి మతపరమైన అంశాల్లో భారత్ ఎప్పుడూ జోక్యం చేసుకోదన్నారు. భవిష్యత్తులో తన వారసత్వం కొనసాగుతుందని టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే దలైలామా వారసుడి ఎంపిక ప్రక్రియపై కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు స్పందించిన సంగతి తెలిసిందే.