ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం
న్యూఢిల్లీ, మే 27 : రాబోయే వర్షాకాల సీజన్‌లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చీఫ్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. దేశం మొత్తం నైరుతి రుతుపవనాల వర్షపాతం 106 శాతం దీర్ఘకాల సగటుతో నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందువల్ల దేశవ్యాప్తంగా ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. కేరళ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు సకాలంలో రుతుపవనాలు విస్తరించడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.
ఈనెల 30 నుంచి దేశంలో ఎండ తీవ్రత, వేడి గాలులు తగ్గుతాయని స్పష్టం చేశారు. ఆగస్టు నాటికి లా నినా పరిస్థితులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని, నాలుగు నెలలు (జూన్ నుంచి సెప్టెంబర్ వరకు) రుతుపవనాల సీజన్లో దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎల్ నినో ఉంటే వేడిగాలులు, లా లినో ఉంటే అధిక వర్షపాతానికి అనుకూలంగా ఉంటుంది. గత ఏడాదిలో ఎల్ నినో కారణంగా దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. దేశంలో వార్షిక వర్షపాతంలో 70 శాతం రుతుపవనాల కారణంగానే కురుస్తుంది. కాగా, ప్రస్తుతం, వాయువ్య భారతదేశంలో మే రెండో వారంలో వర్షపాతం లేకపోవడం, బలమైన పొడి, వేడి గాలుల కారణంగా రాజస్థాన్, గుజరాత్‌లో ఎండ తీవ్రత అధికంగా ఉంది.






