పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై నేడు తీర్పు
విజయవాడ, మే 27, (విజయక్రాంతి): బెయిల్ కోరుతూ మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. పిన్నెల్లి, పోలీసుల వాదనలు విన్న తర్వాత తీర్పును మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ వెంకటజ్యోతిర్మయి వెల్లడించారు. వాదనల సందర్భంగా పిన్నెల్లి తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఓట్ల లెక్కింపు అయ్యే వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఓట్ల లెక్కింపు కోసం పోలింగ్ ఏజెంట్లను నియమించుకోవాల్సిన అవసరం ఉందని, పోలీసులు అరెస్టు చేస్తే దాని ప్రభావం ఎన్నికలపై పడుతుందని చెప్పారు.
ఈవీఎం పగలకొట్టిన కేసులో ముందస్తు బెయిల్ వచ్చిందని, అప్పటినుంచి పిన్నెల్లిని అరెస్టు చేయాలనే ఉద్దేశంతో వరుస కేసులు నమోదు చేస్తున్నారని కోర్టుకు వివరించారు. ఎన్నికల కమిషన్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, అసాధారణంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. పోలీసులు నమోదు చేసిన కేసులు అన్నీ ఎన్నికలకు సంబంధించినవేనని, జూన్ 6 వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలన్నారు.
ఏ విధమైన షరతులు విధించినా పిటిషనర్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పోలీసుల తరఫున పీపీ నాగిరెడ్డి వాదిస్తూ.. పిటిషనర్‌కు ముందస్తు బెయిల్ ఇస్తే ఓట్ల లెక్కింపు నాడు అల్లర్లకు పాల్పడే అవకాశం ఉందన్నారు. పోలీసులను గాయపరిచిన అభియోగాలనూ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు తొమ్మిది కేసుల్లో పిటిషనర్ నిందితుడిగా ఉన్నారని, హైకోర్టు ఉత్తర్వుల తర్వాత కూడా పోలీసుల నిఘాకు అందుబాటులో లేరని ఆరోపించారు. కాగా, పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసి, అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్‌పై దాడి చేసినట్లు కేసు నమోదైంది. ఓ మహిళను దూషించగా రెంటచింతల పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ తర్వాత రోజు పిన్నెల్లి, వెంకట్రామిరెడ్డితో కలిసి కారంపూడిలో అరాచకం చేయబోతే, సీఐ టీపీ నారాయణస్వామి అడ్డుకునే ప్రయత్నం చేశారని కేసు నమోదు చేశారు.






