తండా గిరిజన పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి: వడిత్య సోనాక్షి
వేంసూరు తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేత
స్పందన లేకపోతే సీసీఎల్‌ఏ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయిస్తామని హెచ్చరిక
వేంసూరు,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలంలోని చౌడవరం తండాలో సామాజిక యువ ఉద్యమకారిణి వడిత్యా సోనాక్షి గడపగడపకు తిరిగి ప్రజల సమస్యలపై సర్వే నిర్వహించారు. అక్కడ నివసిస్తున్న 70 కుటుంబాలకు చెందిన మైదాన ప్రాంత గిరిజన పేదలకు ఇళ్ల పట్టాలు లేవని, తమ తండా పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ శనివారం వేంసూరు తహశీల్దార్ జె. మాణిక్‌రావుకు వినతిపత్రం సమర్పించారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, గతంలో పాలకులు తమ తండాలో ఇళ్ల స్థలాలు కేటాయించారని, ఆ స్థలాల్లో కాలక్రమేణా గూడు లేని గిరిజన పేదలు ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారని తెలిపారు. ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాలు, హక్కుపత్రాలు మంజూరు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నట్లు చెప్పారు. అంతేకాకుండా, ఈ విషయంపై కల్లూరు సబ్ కలెక్టర్‌కు, జిల్లా కలెక్టర్‌కు కూడా వినతిపత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. అప్పటికీ ఇళ్ల పట్టాలు, హక్కుపత్రాలు మంజూరు చేయకపోతే హైదరాబాద్‌లోని సీసీఎల్‌ఏ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.






