14 July, 2026 | 4:49 AM

రాజా ది రాజాను ‘మగధీర’తో పోల్చలేం!

14-07-2026 12:00 AM

రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన ‘రాజా ది రాజా’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అనిల్ బోయిడపు దర్శకత్వంలో రూపొందింది. బృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కే నిహారిక దాసరి నిర్మించిన ఈ చిత్రం మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత నిహారిక విలేకరులతో సినిమా విశేషాలు పంచుకున్నారు.

“రుత్విక్ ఒక షార్ట్ ఫిల్మ్‌లో అబ్బాయి, అమ్మాయి రెండు రకాల పాత్రలు చేశాడు. ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత తనపై నాకు మరింత నమ్మకం పెరిగింది. ఒక మంచి ఛాలెంజింగ్ పాత్రతో హీరోగా పరిచయం చేయాలనుకున్నాం. ‘రాజా ది రాజా’ కథ చాలా బలమైన కథ. ఇందులో హీరో రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడు. ఏ నటుడికైనా ఇది పెద్ద ఛాలెంజ్. రుత్విక్ ఆ రిస్క్ తీసుకుని ఈ సినిమా చేశాడు.

సినిమాలో ఉన్న రిస్కీ యాక్షన్ సన్నివేశాలన్నీ తానే స్వయంగా చేశాడు. తొలి సినిమాకే ఇలాంటి రిస్క్ తీసుకోవడం చిన్న విషయం కాదు. ఇలాంటి మంచి ప్రయత్నాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాం. ట్రైలర్ చూసిన తర్వాత ‘మగధీర’తో పోలుస్తున్నారు. అయితే రెండు కథలకు ఎలాంటి సంబంధం లేదు. సినిమా చూసిన తర్వాతే అందరికీ అసలు ట్విస్ట్ తెలుస్తుంది” అన్నారు.