6 May, 2026 | 8:43 AM

ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ కు రాజారాం నేత్రాలు దానం..!

16-09-2025 07:38 PM

పుట్టెడు దుఃఖంలోనూ కుటుంబ సభ్యుల గొప్ప నిర్ణయం 

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలం రవీంద్ర నగర్ లో అనూహ్యంగా మంగళవారం ఎద్దు దాడిలో మృతి చెందిన జంగపల్లి రాజారాం కళ్ళను దానం చేసేందుకు అతని కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. పుట్టెడు దుఃఖంలోనూ కుటుంబ సభ్యులు ఈ గొప్ప నిర్ణయాన్ని తీసుకోవడం అభినందనీయం.మృతుని అల్లుడు, జనహిత సేవాసమితి ప్రధాన కార్యదర్శి ఇప్ప రవి కుటుంబ సభ్యులను అంగీకరించేలా ప్రయత్నించి సదాశయ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ సహకారంతో ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ కు నేత్రాలను అందించారు.

ఈ సందర్భంగా జనహిత సేవాసమితి అధ్యక్షులు ఆడెపు సతీష్ మాట్లాడుతూ జంగపల్లి రాజారాం కుటుంబ సభ్యులకు ప్రజలు మరణించిన తర్వాత తమ శరీర భాగాలు బూడిధై వృధా కాకుండా దానం చేసి సమాజానికి ఉపయోగపడాలని కోరారు. మరణించిన ఎనిమిది గంటల లోపు కళ్ళలోని కార్యాపూర్ అని మాత్రమే సేకరిస్తారని, నేత్ర దానం ద్వారా మరణించినా ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం ఉంటుందని తెలిపారు.

శరీర భాగాలు వైద్య కళాశాలకు అందిస్తే కొన్ని వేల వైద్య విద్యార్థుల బోధనకు ఉపయోగపడతాయన్నారు. ప్రజలు అపోహలు మాని నేత్ర, అవయవ, శరీర దళానికి ముందుకు రావాలని కోరారు. జనహిత సేవాసమితి ప్రధాన కార్యదర్శి ఇప్పరవి గతంలో తన తల్లి నేత్రాలను, ప్రస్తుతం మామ రాజారాం నేత్రాలను దానం చేసేందుకు కృషిచేసి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఇందుకు సహకరించిన జంగ పల్లి రాజారాం భార్య లక్ష్మి, కుమారుడు శ్రీకాంత్ లతోపాటు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.