calender_icon.png 16 September, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు చేపించిన కేంద్రమంత్రి

16-09-2025 07:37:12 PM

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్

చొప్పదండి (విజయక్రాంతి): చొప్పదండి నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల ఎట్టకేలకు నెరవేరింది. అర్నకొండ నుండి మల్యాల క్రాస్ రోడ్డు వరకు 30 కిలోమీటర్ల మేర ఉన్న సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చి కొత్తగా నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 50 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర రహదారుల మౌలిక వసతుల నిధుల నుండి మంజూరి లభించడంతో చొప్పదండి రూరల్ మండల బీజేపీ శాఖ అధ్యక్షులు మొగిలి మహేష్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు స్థానికులు టపాసులు కాల్చి, మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు. గతంలో ఈ రోడ్డు అధ్వాన్నంగా ఉండటం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు తీరనున్నాయని హర్షం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ సింగిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణం వల్ల సమీప గ్రామాల ప్రజల రవాణా సమస్యలు తీరుతాయని, గోపాలరావుపేట ఒక వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. జూలపల్లి, ధర్మారం, చొప్పదండి మండలాల ప్రజలు రామడుగు, పెగడపల్లి, మల్యాల, జగిత్యాల వంటి పట్టణాలకు, అలాగే కొండగట్టు, వేములవాడ వంటి పుణ్యక్షేత్రాలకు సులభంగా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. రైతులు తమ పంట ఉత్పత్తులను తరలించడానికి, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ప్రయాణించడానికి  ఈ రోడ్డు ఎంతో ఉపయోగపడుతుందని  వివరించారు.

కృతజ్ఞతలు తెలియజేసిన బీజేపీ నాయకులు

తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 868 కోట్ల నిధులు మంజూరు కాగా కేవలం కరీంనగర్ పార్లమెంటు పరిధిలోనే 150 కోట్లు వచ్చాయని ఇందులో మూడో వంతు 50 కోట్ల రూపాయలు చొప్పదండి నియోజకవర్గానికి రావడం అనందకరమని, ఈ రోడ్డు మంజూరు కోసం ప్రత్యేక శ్రద్ధ వహించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, స్థానిక శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యం గారికి ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. అర్నకొండ నుండి రాగంపేట, గోపాలరావుపేట, బూరుగుపల్లి మీదుగా మల్యాల క్రాస్ రోడ్డు వరకు ఉన్న ఈ సింగిల్ రోడ్డు అధ్వాన్నంగా మారడంతో, డబుల్ రోడ్డుగా మార్చాలని అనేక సంవత్సరాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందుతున్నాయి.

ఈ రోడ్డు కోసం గతంలో కూడా శ్రీ సింగిరెడ్డి కృష్ణారెడ్డి నాయకత్వంలో పోస్ట్ కార్డు ఉద్యమం నిర్వహించడంతోపాటు ఎన్నోసార్లు బీజేపీ నాయకులు ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారు. ఎట్టకేలకు డబుల్ రోడ్డు మంజూరు కావడంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ గుంట రవి, స్థానిక సంస్థల జెడ్పిటిసి కన్వీనర్ సింగిరెడ్డి భూమిరెడ్డి, మాజీ అసెంబ్లీ కన్వీనర్ మొగిలి సారయ్య మాజీ మండల అధ్యక్షులు మావురం సుదర్శన్ రెడ్డి, బైరగోని కిట్టు గౌడ్, మాజీ ఉపసర్పంచ్ విలాసాగరం అంజయ్య, బద్దెనపల్లి రాజేందర్, దామెర మధుసూదన్ రెడ్డి, సింగసాని కనకయ్య, గసిగంటి రవి, గొల్లపల్లి మునీందర్, దీకొండ శంకర్, మేకల రాములు, మల్లేశం, వెంకటేష్, దూస చిరంజీవి, పరశురాం , అశోక్ , ఇరుకుల రాజు, బాబు తమ్ముడి రాజు తదితరులు పాల్గొన్నారు