16 July, 2026 | 3:50 AM

సూపర్ సాయి

22-04-2024 01:19 AM

బౌలింగ్‌లో సాయికిషోర్.. బ్యాటింగ్‌లో సాయి సుదర్శన్ మెరుపులు

పంజాబ్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం

బౌలింగ్‌లో సాయి కిషోర్.. 

బ్యాటింగ్‌లో సాయి సుదర్శన్ 

సత్తాచాటడంతో గుజరాత్ టైటాన్స్ లీగ్‌లో నాలుగో విజయం నమోదు చేసుకుంది. స్పిన్నర్ల హవా సాగిన పోరులో అఫ్గాన్ ద్వయం రషీద్, నూర్ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేయడంతో పంజాబ్ స్వల్ప స్కోరుకే పరిమితమవగా.. ఆ తర్వాత గుజరాత్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. 

తాజా సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఇది వరుసగా నాలుగో పరాజయం కాగా.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం బెంగళూరుతో పోటీపడుతోంది. మరోవైపు లీగ్‌లో అడుగుపెట్టిన తొలి సీజన్‌లోనే ట్రోఫీ చేజిక్కించుకోవడంతో పాటు రెండో ఏడాది రన్నరప్‌గా నిలిచిన టైటాన్స్.. మూడో సీజన్‌లో లయ అందుకునేందుకు ఇబ్బంది పడ్డా.. చివరకు పంజాబ్‌తో మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చింది. 

మొహాలీ:  ఐపీఎల్లో నిలకడలేమితో ఇబ్బంది పడుతున్న రెండు  జట్ల మధ్య జరిగిన పోరులో గుజరాత్‌దే పైచేయి అయింది. ఆదివారం డబుల్ హెడర్‌లో భాగంగా జరిగిన రెండో పోరులో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధవన్ ఈ మ్యాచ్‌కు కూడా అందుబాటులో లేకపోవడంతో.. సామ్ కరన్ పంజాబ్‌కు సారథ్యం వహించాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ప్రభ్‌సిమ్రన్ సింగ్ (21 బంతుల్లో 35; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. హర్‌ప్రీత్ బ్రార్ (12 బంతుల్లో 29; 4 ఫోర్లు, ఒక సిక్సర్), కరన్ (20) పర్వాలేదనిపించారు. రొసో (9), జితేశ్ శర్మ (13), లివింగ్‌స్టోన్ (6) విఫలంగా కాగా.. గత కొన్ని మ్యాచ్‌లుగా రాణిస్తున్న శశాంక్ సింగ్ (8), అశుతోష్ శర్మ (3) ఈసారి ప్రభావం చూపలేకపోయారు.

స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై రషీద్‌ఖాన్, నూర్ అహ్మద్, సాయికిషోర్ బంతిని గింగిరాలు తిప్పారు. వీరి బౌలింగ్‌లో పరుగులు రాబట్టడం సంగతి పక్కన పెడితే.. వికెట్ పడకుంటే అదే చాలు అన్న చందంగా పంజాబ్ బ్యాటింగ్ సాగింది. ఓపెనర్లు సామ్ కరన్, ప్రభ్‌సిమ్రన్ క్రీజులో ఉన్నంతసేపే మ్యాచ్ పంజాబ్ చేతిలో ఉన్నట్లు కనిపించింది. ఈ జోడీ తొలి వికెట్‌కు 5.3 ఓవర్లలో 52 పరుగులు జోడించగా.. అక్కడి నుంచి వికెట్ల పతనం ఏ దశలోనూ ఆగలేదు. గుజరాత్ బౌలర్లలో సాయికిషోర్ 4, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది.కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (25 బంతుల్లో 35; 5 ఫోర్లు), సాయి సుదర్శన్ (31; 3 ఫోర్లు) రాణించారు. ఆఖర్లో రాహుల్ తెవాటియా (18 బంతుల్లో 36 నాటౌట్; 7 ఫోర్లు) వేగంగా ఆడి పని పూర్తి చేశాడు. లక్ష్యం పెద్దది కాకపోవడంతో.. గుజరాత్ ఆడుతూ పాడుతూ ముందుకు సాగింది. చాన్నాళ్ల తర్వాత తెవాటియా తన ఫినిషింగ్ మెరుపులతో అభిమానులను అలరించాడు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, లివింగ్‌స్టోన్ రెండు వికెట్లు తీశారు. లీగ్‌లో భాగంగా సోమవారం ముంబైతో రాజస్థాన్ అమీతుమీ తేల్చుకోనుంది.