20-02-2026 12:43:43 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి) : తెలంగాణ నుంచి ఖాళీ అయ్యే రెండు రాజ్యసభ సీట్లను పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న సీనియర్లనే ఎంపిక చేయాలనే డిమాండ్ కాంగ్రెస్‌లో వినిపిస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి అధికార బీఆర్‌ఎస్‌తో కొట్లాడటమే కాకుండా పార్టీ కేడర్‌కు అండగా నిలబడిన వారికి పెద్దల సభకు అవకాశం కల్పించాలని ఢిల్లీ పెద్దలను పలువురు కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.
ఈ విషయంలో కాంగ్రెస్ అగ్రనేతలను కలిసేందుకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్లారు. రెండు రాజ్యసభ సీట్లలో కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావుకు, రెండో సీటు మరో సీనియర్ నాయకుడు జెట్టి కుసుమకుమార్‌కు ఇవ్వాలని జగ్గారెడ్డి కోరుతున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఢిల్లీలో కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు.
తెలంగాణలో బీసీ వాదం బలంగా ఉన్నందున, కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అమలుకు పని చేస్తున్నందున రెండు రాజ్యసభ సీట్లలో ఒకటి బీసీలకు ఇవ్వాలని సొంత పార్టీతో పాటు బీసీ సంఘాలు కూడా కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి వీరవిధేయుడిగా ఉంటున్న వీహెచ్‌కు రాజ్యసభకు అవకాశమిస్తే.. పార్టీలో వ్యతిరేకత అనేది ఉండదనే చర్చ కూడా జరుగుతోంది.
ఒక సీటు అభిషేక్ సింఘ్వీకే..
అయితే ఖాళీ అయ్యే రెండు రాజ్యసభ సీట్లలో ఒకటి ప్రస్తుత ఎంపీ అభిషేక్ సింఘ్వీకి.. పార్టీ అధిష్ఠానం కోటాలో మళ్లీ రెన్యువల్ చేసే అవకాశం ఉంది. అంతే కాకుండా పార్టీ సీనియర్ నేతనే కాకుండా సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్న అభిషేక్ సింఘ్వీ సేవలు తెలంగాణ ప్రభుత్వానికి ఎంతో అవసరం ఉన్నాయి. ప్రభుత్వానికి సంబంధించి కేసులను అభిషేక్ సింఘ్వీ సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు.
సింఘ్వీకోసం బీఆర్‌ఎస్ ఎంపీగా ఉన్న కె.కేశవరావును కాంగ్రెస్‌లో చేర్చుకుని రాజ్యసభకు రాజీనామా చేయించారు. కేకే రాజీనామా చేసిన సీటును అభిషేక్‌సింఘ్వీకి కేటాయించి గెలిపించుకున్న విషయం తెలిసిందే. ఇక రెండో సీటు కోసం అరడజన్ మంది పోటీ పడుతున్నారు.
ఇటీవలనే ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేరును పార్టీలోని ఒక ముఖ్య నాయకుడు సూచిన్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సుదర్శన్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేత వీహెచ్‌తో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ తదితరులు కూడా రాజ్యసభ టికెట్ ఆశిస్తున్నారు.