25 March, 2026 | 1:49 AM

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మూత

25-03-2026 12:20 AM
  1. పగిలిన స్టీమ్ పైప్ లైన్.. 10 రోజులపాటు ప్లాంట్ షట్ డౌన్!
  2. ఎరువుల ఉత్పత్తికి తీవ్ర విఘాతం 

పెద్దపల్లి, మార్చి 24 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో  స్టీమ్ పైప్ లైన్ సాంకేతిక లోపం తో పగిలిపోవడంతో పది రోజుల పాటు ప్లాంటును షట్ డౌన్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఎరువుల ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉంది. రామగుండం ఎరువుల కర్మాగారం దేశంలోనే పలు రాష్ట్రాలకు ఎరువులను ఉత్పత్తి చేసి అందిస్తుంది.

కానీ గత సంవత్సరంలో కూ డా సాంకేతిక లోపంతో ఈ కర్మాగారాన్ని అధికారులు సాంకేతిక లోపం ఉందని షట్ డౌన్ చేశారు. దీంతో ఎరువుల ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగి రైతులకు ఎరువులు అందుబాటు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారుల నిర్లక్ష్యమా, సాంకేతిక లోపమా తెలియదు గానీ రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్‌ఎఫ్‌సిఎఫ్) తరచూ షట్ డౌన్ అవుతుండటంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. సాంకేతిక లోపంతో తరచూ ఎరువులు ఉత్పత్తికి ఆటంకం కలుగుతుండటంతో అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది.