8 August, 2026 | 2:39 AM

అనుమతుల్లేవు.. అడ్మిషన్‌లా?

08-08-2026 01:37 AM

రంగారెడ్డి జిల్లాలో విచ్చలవిడిగా అక్రమ కళాశాలలు

విద్యార్థుల జీవితాలతో చెలగాటం

జిల్లాలో ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించి అనుమతులు తీసుకున్న కళాశాలలపై అధికారుల కొరఢా..

రంగారెడ్డి, ఆగస్టు 7 (విజయక్రాంతి): విద్యా వ్యాపారానికి అడ్డాగా మారిన హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దాదాపు 50కి పైగా జూనియర్ కళాశాలలు ఇంటర్మీడియట్ బోర్డు అనుమతులు లేకుండానే దర్జాగా నడుస్తున్నాయి. కార్పొరేట్ మాయమాటలు నమ్మి లక్షలాది రూపాయల ఫీజులు కట్టిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు. అధికారులు నామమాత్రపు చర్యలతో కాలయాపన చేస్తుండటంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

విద్యా వ్యాపారానికి కేంద్రబిందువు:

అనుమతులు లేవు.. అక్రమాలకు అడ్డాగా మారిన జూనియర్ కళాశాలలు. జిల్లా పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 50కి పైగా జూనియర్ కళాశాలలు ఎటువంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా దర్జాగా కొనసాగుతున్నాయి. ఐ ఐటీ, నీట్ శిక్షణల పేరిట తల్లిదండ్రుల బలహీనతలను ఆసరాగా చేసుకుని యాజమాన్యాలు లక్షలాది రూపాయల ఫీజు లను గుంజుతున్నాయి. జిల్లాలో ముఖ్యం గా చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే చందంగా పేరు ఉన్న కార్పొరే ట్ ప్రైవేట్ కళాశాలలో... బ్రాంచీల పేరిట... శివారు ప్రాంతాలలో పలు కళాశాలలో వెలుస్తున్నాయి.

అక్కడ ఆయా కళాశా లలో బోడు ఉండదు... కళాశాలకు సంబంధించిన వివరాలు ఉండవు. అక్కడిదాకా వెళితే తప్ప ఇది ఓహో కాలేజ్ అని... మనకు అసలు నమ్మబుద్ధి కూడా కాదు. ఇలా జిల్లా లో హ యత్ నగర్, సరూర్ నగర్, పెద్ద అంబర్ పేట్, తుర్కయాంజాల్, ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం, తుక్కుగూడ, మణికొండ, హై టెక్ సిటీ, రాజేంద్రనగర్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, చంపాపేట్, మహేశ్వరం, కందుకూరు ప్రాంతాల్లో ఈ కళాశాలల దందా ఎక్కువైంది. ఇంటర్ బోర్డు నియమావళిని పట్టించుకోకుండా పక్కా వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి.

కమీషన్ల దందా: 

గ్రామీణ పాఠశాలలతో కార్పొరేట్‌ ఒప్పందాలు... ఈ అక్రమ అడ్మిషన్ల నెట్వర్క్ చాలా లోతుగా విస్తరించింది.గ్రామాల్లో, మండలాల్లో ఉండే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో కార్పొరేట్ కళాశాలలు ముందస్తుగా రహస్య ఒప్పందాలు కు దుర్చుకుంటున్నాయి. పది దాటిన విద్యార్థులను తమ కళాశాలల్లో చేర్పిస్తే ప్రతి విద్యార్థికి ఇన్ని వేల రూపాయల చొప్పున పాఠశాలల యాజమాన్యాలకు, ప్రత్యేక ఏజెంట్లకు భారీగా కమిషన్లు ముట్టజెబుతున్నారు.

జాబితా పెద్దది.. దోపిడీ అనంతం: 

ఫీజుల పేరిట వేధింపులు చేరే సమయంలో ఏసీ తరగతి గదులు, అత్యుత్తమ హాస్టల్ వసతులు, ప్రఖ్యాత ఫ్యాకల్టీ అని రంగురంగుల బ్రోషర్లతో నమ్మబలుకుతారు. కానీ, అడ్మిషన్ పూర్తయ్యాక అసలు రంగు బయటపడుతుంది.

ట్యూషన్ ఫీజు, హాస్టల్ చార్జీలు, లైబ్రరీ ఫీజు, మెటీరియల్ ఫీజు, స్పెషల్ ఎ గ్జామ్ ఫీజుల పేరిట చాంతాడంత జాబితాతో ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. అదనపు ఫీజులు కడితేనే హాల్ టికెట్లు ఇస్తామని విద్యార్థులను, వారి తల్లిదండ్రుల మానసిక స్థైర్యా న్ని దెబ్బతీస్తున్నారు. ఒక్కొక్క విద్యార్థి నుంచి రెండేళ్లకు కళాశాలను బట్టి రూ. 2లక్షల నుంచి రూ. 10లక్షల వరకు... ఫీజు లు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి జలగలాగా లాగేస్తున్నారు.

అనుమతి లేని కళాశాలలు:

అనుమతులు లేని కళాశాలలు విద్యా సంవత్సరం ముగిసే సమయానికి వేరే అనుమతి ఉన్న కాలేజీలతో కుమ్మక్కై (మిక్సింగ్/ట్యాగింగ్) విద్యార్థులతో పరీక్షలు రాయిస్తున్నాయి. దీనివల్ల టీసీలు  మార్కుల మెమోలు, స్టడీ సర్టిఫికెట్లు పొందడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇటీవల తుర్కయాంజాల్, దిల్సుఖ్నగర్, ఆదిభట్ల ప్రాంతాల్లో సర్టిఫికెట్లు రాక విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డెక్కి ఆందోళనలకు దిగిన సంఘటనలే దీనికి నిదర్శనం.

అగ్ని ప్రమాద ముప్పు: 

భవన భద్రత, అగ్నిమాపక శాఖ అనుమతుల విషయంలో ఈ కళాశాలలు నిబంధనలను బొందపెడుతు న్నాయి.అధికారుల పరిశీలనలో నకిలీ ఎన్‌ఓసీ సర్టిఫికెట్లు సమర్పించిన ఉదంతాలు బయటపడినా యాజమాన్యాలపై ఎటువంటి క్రిమినల్ కేసులు నమోదు చేయడం లేదు. ప్రమాదకరమైన భవనాల్లో, ఇరుకైన గదుల్లో వందలాది మంది విద్యార్థులను ఉంచుతున్నప్పటికీ, ఇంటర్ బోర్డు అధికారులు కేవలం నామమాత్రపు ’షోకాజ్ నోటీసులు’ జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తల్లిదండ్రుల అవగాహన రాహిత్యం: 

కాలేజీ ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి మోసపోకుండా, చేర్పించే ముందే ఆ కాలేజీకి ఇంటర్మీడియట్ బోర్డు గుర్తింపు (ఆఫిలియేషన్ కోడ్) ఉందో లేదో బోర్డు అధికారిక వ్బుసైట్లో సరిచూసుకోవాలి. కేవలం నోటీసులకే పరిమితం కాకుండా, జిల్లా యంత్రాంగం మరియు విద్యాశాఖ కలసి అక్రమ కళాశాలలపై తక్షణమే దాడులు నిర్వహించి సీజ్ చేయాలి.నకిలీ ఎన్‌ఓసీలతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యాలపై ఫోర్జరీ, మోసం కేసులు (420) నమోదు చేసినప్పుడే ఈ దందాతో ముగింపు పడే అవకాశం ఉంది.