వర్సిటీలు పరిశోధనా కేంద్రాలుగా ఎదగాలి
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల తెలంగాణే లక్ష్యం
విజన్ ఇండియా 2047 జాతీయ సదస్సులో మంత్రి జూపల్లి కృష్ణారావు
షాద్‌నగర్, ఆగస్టు 7 (విజయక్రాంతి): స్వాతంత్య్ర శతాబ్ది నాటికి భారత్ను స్వావలంబన కలిగిన విజ్ఞాన దేశంగా తీర్చిదిద్దడంలో యువత, శాస్త్ర విజ్ఞానం, ఆవిష్కరణలదే ప్రధాన భూమిక అని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం కన్హా శాంతి వనంలో నిర్వహించిన విజన్ ఇండియా2047 ఇంటిగ్రేటింగ్ సైన్స్, ఇన్నోవేషన్ అండ్ యూత్ ఎంపవర్మెంట్ జాతీయ సదస్సులో మంత్రి పాల్గొని మాట్లాడారు.
కృత్రిమ మేధస్సు (ఏఐ), డేటా సైన్స్, బయోటెక్నాలజీ, సెమీకండక్టర్లు, పునరుత్పాదక ఇంధనం, అంతరిక్ష సాంకేతికత, స్టార్టప్లు వంటి రంగాలే భవిష్యత్ ఆర్థిక వ్యవస్థను నిర్దేశిస్తాయన్నారు. సీఎం రేవంత్ సారథ్యంలో 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర సమతుల్య ప్రగతి కోసం క్యూర్, ప్యర్, రేర్ మహిళా సాధికారత అనే నాలుగు మూలస్తంభాలపై ముందుకు సాగుతున్నామన్నారు.
ప్రభుత్వ సేవలే శ్రీరామరక్ష:
కార్పొరేట్ విద్య, వైద్యం మరియు వివాహాది వేడుకలలో ఆడంబరాల వల్ల అనేక గ్రామీణ కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్య, వైద్య రంగాలు బలోపేతం కావడం ద్వారానే ’వికసిత్ భారత్’, ’రైజింగ్ తెలంగాణ’ సాధ్యమవుతాయన్నారు. మూఢనమ్మకాలు, సామాజిక రుగ్మతల పై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు త్వరలోనే ’ప్రభాత భేరి’ కార్యక్రమాన్ని ప్రారం భించనున్నట్లు వెల్లడించారు.
విశ్వవిద్యాలయాలు కేవలం తరగతి గదుల బోధనకే పరిమితం కాకుండా ఆవిష్కరణలు, ఉపాధి కల్పన, పరిశోధనా కేంద్రాలుగా మారాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం, పరిశ్రమలు, విశ్వవిద్యాలయాల మధ్య సమన్వయం పెరిగితేనే యువతకు విస్తృత అవకాశాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో పీయూ వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శన స్టాళ్లను మంత్రి పరిశీలించారు.






