25 August, 2026 | 3:38 AM

యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు

25-08-2026 01:27 AM

అనుమతి లేకుండా హాస్టళ్ళు, భవనాలు, గోదాముల నిర్మాణం 

పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల సహకారం 

ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం 

అంజయ్య నగర్ ఘటనతో కనువిప్పు కలిగేనా? 

మేడ్చల్, ఆగస్టు 24 (విజయక్రాంతి): మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. హాస్టళ్ళు, పెద్ద భవంతులు, గోదాంలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మిస్తున్నారు. మేడ్చల్ జిల్లాలో మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. మిగతా జిల్లా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కొంత, మల్కాజిగిరి కార్పొరేషన్ లో కొంత భాగం ఉంది. వీటన్నింటిలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.

పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల అండదండలతోనే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి అనేది బహిరంగ రహస్యం. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను కలిస్తే చాలు ఎంతటి నిర్మాణమైన చేపట్టవచ్చు. ఎన్ని ఫిర్యాదులు వెళ్లిన పట్టించుకోరు. ఎవరైనా ఒత్తిడి చేస్తే తూతూ మంత్రంగా నోటీసు జారీ చేస్తారు. మరింత ఒత్తిడి చేస్తే నిర్మాణ సామాగ్రి సీజ్ చేస్తారు. ఆ తర్వాత మళ్లీ అక్రమ నిర్మాణం యధావిధిగా జరుగుతుంది. 

ప్రోత్సహిస్తున్నది పట్టణ ప్రణాళిక విభాగం అధికారులే...

అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నది పట్టణ ప్రణాళిక విభాగం అధికారులే. తమ కు డబ్బులు ఇస్తే చాలు ఎలాగైనా నిర్మాణం చేపట్టుకోవచ్చని భరోసా ఇస్తున్నారు. వీరి వల్ల మున్సిపల్ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. మున్సిపల్ ఆదాయాన్ని పెంచాల్సిన వీరే అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించి మున్సిపాలిటీలకు ఆదాయం రాకుండా చేస్తున్నారు. గత సంవత్సరం ఎల్లంపేటలో టీపీఎస్ రాధాకృష్ణారెడ్డి భారీగా లంచం తీ సుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డా డు. అయినాఅధికారులలో మార్పు రాలేదు. 

ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం 

మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల అక్రమ నిర్మాణాలకు ఊతమిస్తోంది. స్థానిక అధికారులకు ఉన్నతాధికారుల భయం లేకుండా పోయింది. మున్సిపాలిటీలలో అక్రమ నిర్మాణాల విషయమై ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటివరకు ఒక్క అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని రాజ బొల్లారంలో భారీ షెడ్డు నిర్మించారు. దీనిపై అనేక ఫిర్యాదులు వచ్చాయి.

మున్సిపల్ అధికారులు ఒకసారి సామాగ్రి సీజ్ చేశారు. కానీ వెంటనే పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం షెడ్డు పూర్తయింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్లో కండ్లకోయ, మైసమ్మగూడలో అనుమతి లేకుండా నిర్మించిన హాస్టల్ భవనాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా కండ్లకోయ ప్రధాన రహదారిపై 4 అంతస్తుల భవనం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు. దీనిపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. 

అంజయ్య నగర్ ఘటన కనువిప్పు కలిగేనా? 

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంజయ్య నగర్ లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న హాస్టల్ భవనం కూలి ఇద్దరు మరణించిన విషయం విదితమే. ఈ ఘటనతో నైనా అధికారులకు కనువిప్పు కలగాలి. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో అనుమతి లేని వాటిపై చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనుమతులేని హాస్టల్ భవనాలు ఎన్నో ఉన్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.